ఇచ్చినమాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సవిత ధన్యవాదాలు
అమరావతి (చైతన్య రథం): కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి, వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని, ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. శెట్టి బలిజల పితామహుడిగా పేరుగాంచిన వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించాలని నిర్ణయించడంపై సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్‌కు ఆమె ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కోనసీమ ప్రాంతానికి చెందిన స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి… శెట్టి బలిజ సమాజంలో విద్య, ఐక్యత, ఆత్మగౌరవం కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప సంస్కర్తని కొనియాడారు. విద్య ప్రాముఖ్యతను చాటిచెప్పి, సామాజిక చైతన్యానికి బాటలు వేశారన్నారు. కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి, ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో వయోజన విద్యకు కృషి చేసిన మేధావి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలను భవిష్యత్తరాలకు తెలియజేయాలన్న లక్ష్యంతో దొమ్మేటి జయంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు. ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని అప్పట్లో మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఏటా మార్చి 23న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నారన్నారు. సోమవారం రాజమండ్రిలో దొమ్మేటి వెంటకరెడ్డి రాష్ట్రస్థాయి జయంతిని నిర్వహించనున్నట్లు తెలిపారు. మాట తప్పని నాయకుడంటూ మంత్రి లోకేశ్ పై మంత్రి సవిత ప్రశంసలు కురిపించారు. శెట్టి బలిజల పితామహుడిగా పేరుగాంచిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించడంపై ఆ ప్రకటనలో సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
















