అమరావతి (చైతన్య రథం): భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా దేశ సేవలో రికార్డు నెలకొల్పిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. “భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం దేశానికి అధిపతిగా సేవలందించిన వ్యక్తిగా చారిత్రాత్మక మైలురాయిని సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు. ఆయన దేశానికి 8,931 రోజుల సేవను పూర్తి చేసుకున్నారు. ఈ అసాధారణ ఘనత మన దేశ ప్రగతి, శ్రేయస్సుపట్ల ఆయనకున్న అంకితభావాన్ని, దూరదృష్టి నాయకత్వాన్ని, అవిశ్రాంత నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 2047నాటికి వికసిత భారత్ సాధించాలన్న ఆయన దార్శనికత మనందరికీ స్ఫూర్తినిస్తూ, భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తువైపు నడిపిస్తూనే ఉంది. దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు నడిపిస్తున్న ఆయనకు నిరంతర శక్తి, మంచి ఆరోగ్యం, విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మంత్రి లోకేష్ ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. “ప్రధాని నరేంద్ర మోదీ 8,931 రోజుల పదవీకాలం పూర్తిచేసి భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రభుత్వాధిపతిగా పనిచేసిన వ్యక్తిగా కొత్త జాతీయ రికార్డు నెలకొల్పారు. ఈ అద్భుతమైన మైలురాయి, ప్రజాసేవకు, దేశ నిర్మాణానికి దశాబ్దాలుగా ఆయన కనబరిచిన అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఆయన అవిశ్రాంత నాయకత్వం, దార్శనికతలో స్పష్టత, భారతదేశ అభివృద్ధిపై ఆయనకున్న దృష్టి దేశవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ఈ చారిత్రాత్మక ఘనత సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.

















