`కోట్లాది భక్తులలో ఒకడిగా నా ధన్యవాదాలు
`ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
తిరుమల (చైతన్య రథం): తిరుమల పవిత్రతను కాపాడుతూ శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందిచేందుకు టీటీడీ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. “తిరుమలకు వచ్చే కోట్లాది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా… టీటీడీ మరో చారిత్రాత్మక అడుగు వేసింది. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, ఎఫఎసఎసఎఐ సంయుక్తంగా టీటీడీ సహకారంతో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక వాటర్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ప్రారంభించాను. అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఈ ల్యాబ్ ద్వారా ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను సూక్ష్మస్థాయిలో పరీక్షించవచ్చు. ఇందులోని ఈ-టంగ్, ఈ-నోస్ వంటి అత్యాధునిక సౌకర్యాల ద్వారా ఆహార పదార్థాల రుచి, వాసనను డిజిటల్ పద్ధతిలో ఖచ్చితంగా విశ్లేషించవచ్చు.
అలాగే భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగించేందుకు, రద్దీ నియంత్రణ కోసం తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించాను. భక్తులకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం జరిగేలా ఈ కమాండ్ కంట్రోల్ పనిచేస్తుంది. ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ద్వారా జనసాంద్రత, దర్శనం కోసం వేచివుండే సమయం, వాహనాల రాకపోకలు, వసతి, వైద్య అత్యవసరాల వంటివన్నీ ఒకే ప్లాట్‌ఫాం ద్వారా ఖచ్చిత సమయంలో పర్యవేక్షించి మెరుగైన సేవలు అందించేందుకు సహాయపడుతుంది. ఏఐ ఆధారిత విశ్లేషణ ద్వారా రద్దీ పరిస్థితులను ముందే అంచనా వేసి క్యూ మేనేజ్‌మెంట్ సమర్థంగా నిర్వహించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పవిత్రత, ఆధ్యాత్మికత, సౌకర్యం, ప్రశాంతత వంటి అంశాల్లో టెక్నాలజీ వాడకం ద్వారా కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలు కాపాడేలా టీటీడీ చేస్తున్న కృషికి శ్రీవారి భక్తుడిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
















