ఢిల్లీ (చైతన్య రథం): దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట’లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ టెక్ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, అరామ్కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహ్మాన్ ఐతుకైర్, లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్, ఆధార్ ఫౌండర్ సీటీఓ శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లాతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహించారు. ఏపీ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించే అంశాలపై వారితో చర్చించారు. అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న ‘కృత్రిమ మేధ ద్వారా పోటీతత్వం’ అంశంపై జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమీప భవిష్యత్‌లో అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడే రోజు వస్తుందన్నారు. గూగుల్‌లాంటి సంస్థల రాకతో ఏపీలోని విశాఖపట్నం డేటా హబ్ మారుతుందన్నారు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరికరాలు తయారు చేసేలా క్వాంటం ఎకో సిస్టమ్ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు.
దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని, దేశం దానిని సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ ఏఐని వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఏపీలో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడిటెక్ పార్క్‌లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని, ఈ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, క్వాంటం ఎకోసిస్టమ్ తీర్చిదిద్దుతున్నట్టు చంద్రబాబు వివరించారు.















