అమరావతి (చైతన్యరథం): జేఎన్‌టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం ఐచ్ఛికాలు ఇచ్చేందుకు జేఎన్ టీయూ-కాకినాడ, జేఎన్‌టీయూ జీవీ ఉద్యోగులకు వీలు కల్పించడానికి 2008లో 30వ చట్టంలోని 45వ విభాగాన్ని సవరిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జేఎన్‌టీయూ- గురజాడ, విజయనగరం (జేఎన్‌టీయూ-జీవీ) ఏ చట్టం కింద, ఏ సంవత్సరంలో స్థాపించారు, జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ గురజాడ, విజయనగరం మధ్య బోధన, బోధనేతర సిబ్బంది విభజన లేదా, కేటాయింపులకు సంబంధించి ఆ చట్టంలో ఏదైనా నిబంధన ఉందా అని సభ్యుడు పాలవలస విక్రాంత్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. 2008లో జేఎన్‌టీయూ 30వ చట్టాన్ని సవరించిన కారణంగా 2021లోని 22వ చట్టం ద్వారా జేఎన్ టీయూ-జీవీని 12-01-22 తేదీన ఏర్పాటు చేశామన్నారు. జేఎన్‌టీయూ యాక్ట్ 2008, సెక్షన్ నెం.45 చూస్తే.. ఎనేబిలింగ్ క్లాజ్ లేకుండా పోయింది. దానివల్ల లీగల్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చాయి. దీనిపై 27 కోర్టు కేసులు ఉన్నాయి. వెళ్లాల్సిన వారు వెళ్లక, ఆప్షన్ ఇచ్చిన వారిని వీసీ రిలీవ్ చేయక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నెలలో మేం సవరణ పూర్తిచేస్తాం. ఫైనాన్షియల్ స్టెబిలిటీపై యాక్ట్‌లో సెక్షన్ నెం.46 విషయానికి వస్తే ఆడిట్ వారు అభ్యంతరం లేవనెత్తారు. ఆడిట్ పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. పూర్తిచేసిన అనంతరం యూనివర్సిటీకి మేం పేమెంట్ చేస్తాం. గ్యాప్ లేకుండా చూస్తాం. రూ.119 కోట్లు ఇప్పటికే బదిలీ చేశాం. అది ఆడిట్ అయిన తర్వాత బ్యాలెన్స్ మేం పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ చెîప్పారు.













