- ఆర్టీసీలో వెయ్యి ఈవీ బస్సుల కొనుగోలు
- కీలక శాఖల్లో నిబంధనల సరళతరంపై దృష్టి పెట్టండి
- పన్నుల వసూళ్లు తగ్గకూడదు, వ్యాపారులను వేధించకూడదు
- కేంద్రం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి
అమరావతి (చైతన్యరథం): ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు. ట్రూ డౌన్ ఫలితాలు ప్రజలకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు భారాన్ని కూడా తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయంలో ఏఐ సాంకేతికత, విద్యుత్, విత్తన నిర్వహణ, డ్రోన్లు, యాంత్రీకరణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. సోమవారం రాష్ట్ర సచి వాలయం ఐదో బ్లాకులో మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ పాలసీలు, పథకాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… “వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, మెరుగైన ధరలు లభించేందుకు ఉన్న అవకాశాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. గ్లోబల్ మార్కెట్ ఉండే పంటలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. రాయలసీమను ఉద్యాన రంగంలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతోపాటు ప్రైవేటు పెట్టుబడులపైనా దృష్టి పెట్టాలి. ప్రస్తుతం రాయలసీమ నుంచే 220 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది.
త్వరలోనే 400 మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు నాలుగు లైన్ల రైల్వే లైన్ వస్తోంది…. స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టు కూడా త్వరలోనే సాకారమవుతుంది. నెట్ జీరో ఎమిషన్ కాన్సెప్టుతో విద్యుత్ ఉత్పాదన జరగాలి. పీఎం కుసుమ్, సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులు వేగంగా చేపట్టాలి. రూ.3.90కే విద్యుత్ కొనుగోలు ధర తగ్గేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీసీలో కనీసం వెయ్యి బస్సులను ఈవీగా మార్చాల్సిన అవసరం ఉంది. కుప్పంలో ఇటీవల ఓ ఐదువేల పైచిలుకు ఇ-సైకిళ్లు పంపిణీ చేశాం. ఈ తరహా విధానాలతో వేగంగా ట్రాన్సిషన్ జరుగుతుంది. గతంలో ఏపీలో నీరు, విద్యుత్ విషయంలో లోటు ఉండేది. ఇప్పుడు మిగులు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక మీటరు వరకు భూగర్భ జలాలను పెంచటం ద్వారా దాదాపు రూ.4వేల కోట్లు ఆదా అవుతుంది.” అని సీఎం వెల్లడించారు.
నిబంధనలు తగ్గాలి… పాలన సులభం కావాలి
“చిన్న రైస్ మిల్లు పెట్టడానికే 30కి పైగా అనుమతులు కావాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి పోవాలి. చిన్నపాటి వ్యాపారం ప్రారంభించడానికి 30చోట్లకు తిరగడం కష్టసాధ్యమైన అంశం. మరోవైపు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. వివిధ కీలక శాఖల్లో నిబంధనలను సరళతరం చేయాలి. అగ్నిమాపక, పురపాలక, అటవీ, స్కూల్ ఎడ్యుకేషన్… ఇలా వేర్వేరు శాఖల్లో నిబంధనలను మరింత సడలించాలి. నిర్దేశిత కాలపరిమితి ముగిసిన తర్వాత చట్టాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సంస్కరణల్లో ముందుండాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఎలాంటి ఆటంకమూ రాకూడదు. శాండ్, మైన్ తదితర అంశాల్లో నిబంధనలు సులభంగా ఉండాలి. సింగిల్ విండో విధానం అనుసరించాలి. రాజధానికి అవసరమైన ఇసుక, గ్రావెల్ కూడా రానీయకుండా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల అధికారుల నుంచి ఇబ్బందులు వస్తున్నాయనే ఫిర్యాదులు ఇంకా వస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మెటిరీయల్ సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సేవలను అందుబాటులోకి తేవాలి. వీటి గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నాం. దేవదాయ వంటి శాఖలు ఇంకాగాడిలో పడాల్సి ఉంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా పనులు పూర్తి చేసుకోగలిగేలా చేయడమే సుపరిపాలన. ఆ దిశగా అందరూ కృషి చేయాలి. అందరూ భాగస్వాములు కావాలి.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర నిధులు మురిగిపోతే అధికారులనే బాధ్యులుగా చేస్తాం
“ప్రొడక్ట్ పర్ఫెక్షన్పై దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఉత్పత్తులు వస్తేనే ఎక్కువ మార్కెట్ సాధ్యం అవుతుంది. స్వయం సహాయ సంఘాలకు కూడా ‘స్వయం’ అనే పేరిట బ్రాండ్ రూపొందించాం. ఈ బ్రాండ్ ద్వారా వారు తయారుచేసిన ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. అరకు కాఫీ తరహాలోనే కోకో పంటకు కూడా మంచి బ్రాండింగ్ రావాలి. ఉత్పత్తుల నాణ్యతతో పాటు బ్రాండ్ ఇమేజ్ ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. నగర ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణం కోసం అవసరమైన మేరకు భూసేకరణ చేపట్టాలి. దీనికి అవసరమైన నిధులను పీసీబీ సమకూరుస్తుంది. రూ.300 కోట్ల వ్యయంతో ఎస్టీపీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో లెగసీ వేస్ట్ను వేగంగా క్లియర్ చేయాలి. 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా ప్రణాళికలు చేయాలి. ఉగాది నుంచి పాఠశాలల్లో గ్రీన్ కవర్ కోసం దేశీయ వృక్ష జాతుల పెంపకంపై కార్యాచరణరూపొందించాలి.
గ్రీన్ కవర్ పెంచే విషయంలో విద్యార్థులను భాగస్వాములు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. తీర ప్రాంతంలో కోత నివారణకు ఉప ముఖ్యమంత్రి చేపట్టిన ప్రాజెక్టు అభినందనీయం. తీర ప్రాంతంలో ఆర్కిడ్స్ సాగు ద్వారా రైతులకు ఆదాయం, కోత నివారణ సాధ్యం అవుతుంది. పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయాలి. అలాగని వ్యాపారులను వేధించి వసూలు చేయవద్దు. రాష్ట్ర ఖజానాకు నష్టం రాకూడదు. రిజిస్ట్రేషన్ విభాగంలో ఈ ఏడాది రూ.9,103 కోట్లతో 27 శాతం మేర వృద్ధి నమోదైంది. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, పురపాలక శాఖ ఇలా విభాగాలు అన్నీ సమర్థంగా పని చేయాలి. అటవీ శాఖ దగ్గర ఉన్న ఎర్రచందనం విక్రయించి ఆదాయం ఆర్జించాల్సిన అవసరం ఉంది. ఎర్రచందనం విక్రయం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశాం. ప్రభుత్వ శాఖలన్నీ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధుల్ని తక్షణం ఖర్చు చేయాలి.
అన్ క్లెయిమ్ డిపాజిట్ల విషయంలో కలెక్టర్లు తక్షణం కేవైసీ చేపట్టాలి. 1,04,727 పీడీ ఖాతాల్లో ఉన్న అన్ క్లైమ్ డిపాజిట్ల విలువ రూ.148 కోట్లుగా ఉన్నాయి. వీటిని కలెక్టర్లు వినియోగించుకోవచ్చు. 1,04,727 పీడీ ఖాతాలకు కేవైసీ సమర్పించాల్సి ఉండగా… రూ.34 కోట్ల అన్ క్లైమ్ డిపాజిట్లకు చెందిన కేవలం 7,742 ఖాతాలకు మాత్రమే కలెక్టర్లు కేవైసీ చేయించారు. సంస్కరణల ప్రాతిపదికన సాస్కీ కింద ప్రాజెక్టుల నిధులు త్వరితగతిన వచ్చేలా కింద ప్రాజెక్టుల నిధులు త్వరితగతిన వచ్చేలా చూడాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.26,021 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాం.” అని ముఖ్యమంత్రి వెల్లడించారు. సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా హాజరయ్యారు.













