- ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్‌తో ఒప్పందం
- స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు
విజయవాడ(చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వ ‘జీరో పావర్టీ పీ4’ (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్‌పార్టనర్‌షిప్) చొరవలో భాగంగా ‘బంగారు కుటుంబం’ పథకం కింద నిరుద్యోగ యువతకు ఉచిత జీఎస్టీ ఫైలింగ్ శిక్షణ అందించేందుకు స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ (SAPఖీ), ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ మధ్య మంగళవారం లైలా కాలేజ్ ఆడిటోరియం ఎదురుగా గల స్థానిక వెంకటేశ్వర కాలనీలో స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ కార్యాలయంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిం చేందుకు ప్రతి ఏటా ఉచిత శిక్షణ ఇవ్వాలని టాక్స్ బార్ అసోసియేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు సమక్షంలో ఫౌండేషన్ సీఈఓ జె.విజయలక్ష్మి, ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు మాట్లాడుతూ జీఎస్టీ ఫైలింగ్‌లో ఒక నెలరోజుల ఉచిత శిక్షణ ఉంటుందని, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించి నెలవారీ జీఎస్టీ రిటర్నులను ఫైల్ చేస్తూ స్వయం ఉపాధిని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ సెక్రటరీ సురేష్‌కుమార్, ట్రెజరర్ ఫణికుమార్, జీఎస్టీ ట్రైనర్ చక్రరమణ, స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.















