అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌కు ఆశాకిరణంగా ఆక్వారంగాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడిరచారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులకు, ఆక్వా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘‘సుదీర్ఘ సముద్ర తీరం, డెల్టా ప్రాంతం, సరస్సులు, రిజర్వాయర్లు మనల్ని బ్లూ ఎకానమీలో దేశంలోనే ముందు నిలిపాయి. రాష్ట్ర జీఎస్డీపీలోనూ మత్స్యరంగానిదే అగ్ర వాటా. దీనికి మరింత మద్దతిచ్చేలా మత్స్యకారులకు, ఆక్వారైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. వేట నిషేధ సమయంలో ‘మత్స్యకారుల సేవలో’’ పథకం కింద 1,29,178మందికి రూ.20,000 చొప్పున ఆర్థికసాయంగా రూ.259 కోట్లు అందించాం. గంగపుత్రులు కోరుకున్నట్టుగా 217 జీవో రద్దు చేసి సొసైటీలకే హక్కు కల్పించాం. ఆక్వారంగం బలోపేతానికి రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆక్వారంగాన్ని ఆంధ్రప్రదేశకు ఆశాకిరణంలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని మాటిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.














