- వచ్చే ఉగాదిన 5.9 లక్షల గృహప్రవేశాలు చేయిస్తాం
- ఇల్లులేని పేదల గుర్తింపు ప్రక్రియ డిసెంబర్ 1నాటికి పూర్తి
- ఇళ్ల నిర్మాణం నిమిత్తం ముస్లింలకు అదనంగా రూ.50 వేలు
- గత పాలకులు ఇళ్లను రద్దు చేశారు… బిల్లులు పెండిరగ్ పెట్టారు
- కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని కాదు… మంచిని చూడండి
- దేవగుడిపల్లె ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు పిలుపు
- పండుగ వాతావరణంలో.. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలు
- సామూహిక గృహప్రవేశాలను వర్చువల్‌గా ప్రారంభించిన చంద్రబాబు
రాయచోటి (చైతన్య రథం): 2029నాటికి ప్రతి పేదవాడికీ సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఉగాది రోజున మరో 5.9 లక్షల గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో బుధవారం జరిగిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లను దేవగుడిపల్లె సభా ప్రాంగణం నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా ఇంటి తాళాలు అందజేశారు. సొంత స్థలాలున్న పలువురికి ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి పత్రాలు అందజేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘‘మంగళవారం కనిగిరిలో ఎంఎస్‌ఎంఈ పార్కు ప్రారంభించాం. ఆ మరుసటి రోజే పేదలకు ఇళ్లు ఇవ్వడం ఆనందంగా ఉంది. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ఇల్లంటే కేవలం నాలుగు గోడలు కాదు… ఒక కుటుంబానికి గౌరవం, సంతోషం, భద్రత, భరోసా. 1984లో ఎన్టీఆర్ దేశంలోనే మొదటిసారిగా పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో 3 లక్షల ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేశాం. పీఎంఏవై బీఎల్సీ కింద 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ కింద 6,866 ఇళ్లు.. మొత్తం 3,00,192 ఇళ్లు నిర్మించాం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.
గత ప్రభుత్వం పేదల సొంతింటి కలను కూల్చేసింది
‘‘2014-2019 మధ్య రూ.16 వేల కోట్ల వ్యయంతో 8 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. గత ప్రభుత్వం పేదల సొంతింటి కలను చిదిమేసింది. 4.73 లక్షల ఇళ్లు రద్దు చేయడమే కాకుండా… 2.73 లక్షలమంది లబ్దిదారులకు చెల్లించాల్సిన రూ.900 కోట్లు బకాయిలు పెట్టింది. ఆ బకాయిలను చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత పాలకులు గృహనిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేశారు. నివాస యోగ్యంకానిచోట్ల పేదలకు స్థలాలిచ్చారు. ఇళ్లు నిర్మించకుండా వదిలేశారు. ఇళ్ల స్థలాల స్కీం పేరుతో స్కాం చేశారు. చదును చేసే పేరుతో అవినీతికి పాల్పడ్డారు. చివరకు ఇసుకలోనూ కోట్లు దోచుకున్నారు. ఐదేళ్లలో కేంద్రం డబ్బులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇది పేదల ప్రభుత్వం. పేదలకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పని చేస్తున్నాం. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చే డబ్బేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తోంది.
పట్టణ ప్రాంతాల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.2 లక్షలు ఆర్ధిక సాయం చేస్తోంది. దీనికి అదనంగా ఎస్సీ, బీసీలకు రూ.50,000, ఎస్టీలకు రూ.75,000, పీవీటీజీలకు రూ.1,00,000 చొప్పున ఇస్తున్నాం. ఇకపై ముస్లింలకు కూడా రూ.50 వేలు అదనంగా అందజేస్తాం. దాదాపు 6 లక్షలమంది ఇళ్లు కట్టుకునే స్థోమత లేక నిలిపేశారు. వీటిని పూర్తి చేసేందుకు మేం సహకరిస్తాం. ఈ నిర్ణయంతో 3.73 లక్షలమంది బీసీలకు, 1.57 ఎస్సీలకు, 46 వేలమంది ఎస్టీలకు, 22 వేలమంది గిరిజనులకు మేలు జరుగుతుంది. ఈ అదనపు సాయంవల్ల ప్రభుత్వానికి రూ.3,220 కోట్ల ఖర్చవుతుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టడంతోపాటు… తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు, గ్యాస్ కనెక్షన్, సోలార్ విద్యుత్, ఇంటర్నెట్‌వంటి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసానిచ్చారు.
అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం
‘‘సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి సాధ్యం. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తాం. రూ.50 వేలకోట్ల బ్యాంకు రుణాలు తీసుకున్న పొదుపు మహిళలు సకాలంలో చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటిపైనే కరెంటు తయారు చేసుకునేలా సోలార్ ఏర్పాట్లు చేస్తాం. ఒకప్పుడు పొలంలో పంటలు పండేవి. ఇప్పుడు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం తాగునీటి పథకాలను కూడా నిర్వీర్యం చేసింది. జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్రం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం పులివెందులకు కూడా నీరివ్వలేదు. త్వరలో పులివెందులకూ తాగునీరు అందిస్తాం. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు సూపర్ సిక్స్ అమలు చేశాం.
మహిళలకు దీపం పథకం కింద ఉచితగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అర్హులకు పింఛన్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. రైతులకు మూడు విడతలుగా ఆర్ధిక సాయం అందించేలా అన్నదాత సుఖీభవ పథకాన్నీ అమలు చేస్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా 16,347 మందిని ఉపాధ్యాయులుగా భర్తీ చేశాం. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం, పెట్టుబడులు అనే మాట వినపడలేదు. నాడు పారిశ్రామికవేత్తలు పారిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల కాలంలో రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకున్నాం. విశాఖ సీఐఐ సదస్సులో మరో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటాం. 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన హామీకి కట్టుబడి ఉన్నాం. ఐదేళ్లలో కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేకపోయారు. కూటమి ప్రభుత్వం రాగానే రూ.500 కోట్లు విడుదల చేసి రోడ్లన్నీ మరమ్మతులు చేస్తున్నాం. ప్రజలు కూడా తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. కులం, మతం, ప్రాంతం అని చూడకుండా… మంచి చేసేవారిని ఆశీర్వదించాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
నదుల అనుసంధానంతో కరవుకు చెక్
‘‘నదుల అనుసంధానం నా జీవిత ఆశయం. గంగా-కావేరి అనుసంధానం జరిగితే దేశంలో కరవునే మాట వినపడదు. సాగునీటి ప్రాజెక్టులను నేను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. కరువురహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో తాగు, సాగునీటి కొరత లేకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నాం. వెనిగల్లు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిరది. మరో రూ.22 కోట్లు ఇస్తే మరిన్ని చెరువులకు నీరందే అవకాశం ఉండటంతో వెంటనే మంజూరు చేస్తున్నాం. వచ్చే ఏడాదికి శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తి చేస్తాం. ఇక్కడనుంచి చిత్తూరుకు హంద్రీనీవా నీరు మళ్లిస్తాం. అలాగే మొదటి ఫేజ్‌లో నల్లమల సాగర్ ద్వారా వెలుగొండకు నీళ్లు తెస్తాం. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం. 2029నాటికి స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులు వేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.















