- గ్లోబల్ డెస్టినేషన్‌గా విశాఖ ఎకనమిక్ రీజియన్
- పోర్ట్ ఆధారిత అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్
- వీఈఆర్ 2040 మాస్టర్ ప్లాన్ రూపకల్పన సదస్సులో సీఎం చంద్రబాబు
- విశాఖ ఎకనమిక్ రీజియన్ డాక్యుమెంట్ విడుదల చేసిన సీఎం, నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం
విశాఖపట్నం (చైతన్య రథం): రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు… పెట్టుబడులను తెచ్చేలా పూర్తిస్థాయిలో దృష్టి సారించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పాటైన 17 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తేగలుగుతున్నామని ప్రకటించారు. పెట్టుబడుల సదస్సుకు ముందు రోజైన గురువారం నిర్వహించిన విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సుకు సీఎం హజరయ్యారు. గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా విశాఖ రీజియన్ అభివృద్ధి చేసేలా రూపొందిస్తోన్న ప్రణాళికపై చర్చించారు. అలాగే విశాఖ ఎకనామిక్ రీజియన్ `2040 మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై దృష్టి సారించాలన్నారు. ఈ సదస్సు వేదికగా విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్‌మెంట్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి, నీతిఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘విశాఖను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. ప్రధాని మోదీ ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నారు. 2038కి భారత్ రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుంది. 2047కు భారతదేశం అగ్రస్థానంలోకి రావటాన్ని ఎవరూ ఆపలేరు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఓ విజన్ తయారు చేసుకుని అమలు చేస్తున్నాం. దేశంలోని నాలుగు నగరాలకు విజన్ తయారు చేయాలని కేంద్రం నిర్దేశించింది. ముంబై, వారణాసి, సూరత్, విశాఖవంటి నగరాల అభివృద్ధికి విజన్ రూపొందించాలని కేంద్రం సూచించింది. ఈమేరకు ప్రస్తుతం రూపొందించుకున్న విజన్ అమలు చేయాలని నిర్ణయించింది. అక్షర క్రమంలో, అభివృద్ధి పోటీలో ఏపీనే ఎప్పుడూ ముందుంటుంది. సాగరతీరాన ఉన్న విశాఖ నగరం దేశంలోనే అత్యంత సుందరమైన ప్రాంతం’’ అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
వాళ్లు పాడు చేశారు… మేం బాగు చేస్తున్నాం
‘‘గత పాలకులు రాష్ట్రాన్ని, దాని అభివృద్ధిని సర్వనాశనం చేశారు. అందుకే కూటమిగా ప్రజల మద్దతుతో పునర్నిర్మాణం చేస్తున్నాం. రూ.3.65 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌కంటే ముందే కుదుర్చుకున్నాం. రెండు రోజుల సదస్సులో మరిన్ని పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నాం. 17 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే పరిస్థితికి ప్రస్తుతానికి ఏపీ చేరింది. గూగుల్ డేటా సెంటర్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో వస్తోంది. అనకాపల్లిలో దాదాపు రూ. లక్ష కోట్లతో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మించబోతోంది. 9 జిల్లాలతో ఏర్పాటు చేస్తున్న విశాఖ ఎకనామిక్ రీజియన్ భవిష్యత్ ఆర్థిక శక్తిగా ఏపీని నిర్దేశించే ఓ మోడల్. విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్, సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. విశాఖపట్నం ఇండస్ట్రియల్ రీజియన్ మాస్టర్ ప్లాన్ `2040కు రూపకల్పన చేశాం. తూర్పుతీరంలో వీఈఆర్ దేశ ఆర్ధిక ప్రగతికి గేట్ వే. అన్ని వనరులున్న 9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటైంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి చైర్మన్ హోదాలో నేనే స్వయంగా అభివృద్ధిని పర్యవేక్షిస్తాను. అలాగే ఈ రీజియన్‌కు పరిశ్రమల శాఖ కార్యదర్శి సీఈఓగా వ్యవహరిస్తారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తాం. ఇదే ప్రాంతంలో ఆక్వా సహా ఇతర రంగాలకు చెందిన పరిశ్రమలనూ ఆకర్షిస్తాం. పర్యాటకంతోపాటు హెల్త్ కేర్ రంగంలోనూ విశాఖ ఓ కేంద్రంగా మార్చేలా ప్రణాళికలు చేస్తున్నాం. పోర్టులు, పారిశ్రామిక కారిడార్‌లు, లాజిస్టిక్స్, నౌకా, రక్షణ పరిశ్రమలు, టూరిజం రంగాలను సమన్వయం చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.
పోర్టులే… ఏపీ అభివృద్ధికి హార్ట్
‘‘రాష్ట్రాన్ని పోర్ట్ ఆధారితంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. విశాఖ, గంగవరం, కాకినాడ, రామాయపట్నం పోర్టులను అనుసంధానం చేస్తున్నాం. తూర్పుతీర సముద్ర వాణిజ్యానికి విశాఖను ప్రధాన నోడల్ పాయింట్‌గా అభివృద్ధి చేస్తాం. విశాఖ`శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా తీర్చిదిద్దుతాం. సముద్ర ఆధారిత పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నాం. తీర ప్రాంత ఆర్థిక కార్యకలాపాల ద్వారా సుస్థిర జీవనోపాధి అవకాశాలు సృష్టించడం మా ప్రభుత్వ విధానం. స్మార్ట్ లాజిస్టిక్స్, కనెక్టివిటీపై ప్రధానంగా దృష్టి పెట్టాం. విశాఖ`కాకినాడ`రాజమండ్రి హైవే, రైల్వే లైన్లను మెరుగుపరుస్తాం. ఎయిర్ కార్గో, ఇండస్ట్రియల్ పార్కులు, ఎక్స్‌పోర్ట్ హబ్‌లను ఒకే ఎకో సిస్టమ్ కిందకు తీసుకువస్తాం. స్కిల్ విశాఖ ఇనిషియేటివ్ ద్వారా 1 లక్షమంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తాం. మారిటైమ్, నావల్ సిస్టమ్ క్లస్టర్ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వ, నౌకాదళ, ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, అనిత, గుమ్మిడి సంధ్యారాణి, సీఎస్ విజయానంద్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు హజరయ్యారు.















