- 98 సంస్థలతో ఎంఓయూలకు సిద్ధం
- అందుకు.. విశాఖ సీఐఐ సదస్సే వేదిక
- ప్రకటించిన మంత్రి కందుల దుర్గేష్
విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త పర్యాటకానికి బాటలు వేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిరచారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సిఐఐ సదస్సులో భాగంగా విశాఖపట్నంకు చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ గ్రీన్ పార్క్ హోటల్ లో వివిధ మీడియా ఛానళ్లతో పర్యాటక రంగ విశేషాలను పంచుకున్నారు. విశాఖ పట్నం, అమరావతి, తిరుపతిలో ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహించి పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆహ్వానించామన్నారు. ఇప్పటివరకు దాదాపు 12 వేల కోట్లకు పైగా పర్యాటక రంగ పెట్టుబడులు సాధించామన్నారు. ఈ భాగస్వామ్య సదస్సులో భాగంగా రాష్ట్రం మొత్తం పర్యాటక రంగంలో 98 ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు. అన్ని పర్యాటక విభాగాలను సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. సముద్రతీరంలో వెల్ నెస్ సెంటర్లు, ఎకో టూరిజంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. పర్యాటక రంగంలో మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులతో పాటు 2, 3 స్టార్ హోటళ్లు తెస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో పర్యాటకం ఉంటుందని హామీ ఇచ్చారు. పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని విభిన్న పర్యాటక ప్రక్రియలకు శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పన, నూతన పర్యాటక పాలసీ 2024-29 తో పర్యాటక రంగానికి ఊతం వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.














