- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే మన సక్సెస్
- పారదర్శక పాలనతోనే గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ పెట్టుబడులు
- అన్నిరంగాల్లో ఏపీని నెం.1గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం
- మరికొన్ని ఐటి జెయింట్స్ త్వరలో విశాఖపట్నానికి రాక
- నెలాఖరుకే గూగుల్ ఏఐ హబ్‌కు శంకుస్థాపన చేస్తాం
- ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా విశాఖను తీర్చిదిద్దుతాం
- 30వేల ఉద్యోగాలు కల్పించే 5 సంస్థలకు మంత్రి లోకేష్ భూమిపూజ
విశాఖపట్నం (చైతన్య రథం): కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ మాత్రమేగాక, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తుండటం వల్లే గ్లోబల్ సంస్థలన్నీ ఏపీ వైపు చూస్తున్నాయి. ఈ నమ్మకంతోనే ప్రపంచంలో ప్రముఖ సంస్థలను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించ గలిగిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖలో సుమారు 30వేల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించే 5 సంస్థలకు మంత్రి లోకేష్ గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా యండాడలో ఏర్పాటుచేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ… గూగుల్ తమ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించడం, ఆర్సెలర్ మిట్టల్ రూ. 1.35లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం కూటమి పాలన పారదర్శకత, విశ్వాసానికి అద్దం పడుతోందన్నారు. ‘‘గూగుల్ ప్రతినిధులు తొలిసారి విశాఖకు వచ్చాక వారితో వరుస చర్చలు జరిపి 13నెలల్లో రాష్ట్రానికి రప్పించాం. ఈ నెలాఖరుకు గూగుల్ ఏఐ హబ్‌కు శంకుస్థాపన చేస్తాం. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను కేవలం జూమ్ కాల్‌తో రాష్ట్రానికి రప్పించాం. వారితో చర్చలు జరిపినపుడు 3 సమస్యలు చెప్పారు. ఎన్‌ఎండిసి నుంచి స్లరీ పైప్‌లైన్ కోరగా, ముఖ్యమంత్రి వెంటనే ప్రధానితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించారు’’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
విశాఖకు మరికొన్ని ఐటి జెయింట్స్ రాబోతున్నాయి
‘‘టిసిఎస్, కాగ్నిజెంట్ త్వరలో విశాఖకు వస్తున్నాయి. మరికొందరు ఐటి జెయింట్స్ రాష్ట్రానికి రాబోతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం. క్లస్టరైజేషన్ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నాం. కర్నూలు, అనంతపురంలో రెన్యువబుల్ ఎనర్జీ, కడప,చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, ప్రకాశంలో సిబిజి, కృష్ణా, గుంటూరులో రాజధానిని అభివృద్ధి చేస్తున్నాం. ఆసియాలోనే తొలి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ త్వరలో అమరావతికి రాబోతోంది. గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ఫార్మా హబ్, కెమికల్ హబ్, డేటా సిటీ, స్టీల్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 20 క్లస్టర్ల ద్వారా వర్టికల్, హారిజంటల్ విధానంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.
మా మనసులో ఎల్లప్పుడూ విశాఖకు స్థానం
‘‘విశాఖపట్నం మా మనసుకు మా మనసుకు దగ్గరగానే ఉంటుంది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా మాకు ఎదురుగాలి వీచినా విశాఖ ప్రజలు మాకు అండగా నిలిచారు. గతఎన్నికల్లో నాకు 91వేలమెజారిటీ వచ్చినా సంతృప్తి లేదు. పల్లా శ్రీనివాసరావు మొదటిస్థానం, గంటా శ్రీనివాసరావు రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో విశాఖ ఎంపి భరత్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. విశాపట్నం భవిష్యత్తు నగరంగా అభివృద్ధి చెందబోతోంది. విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యలలో 50శాతం మంది తొలిసారి గెలిచినవారు. మంత్రివర్గంలో 75శాతం మంత్రులు కొత్తవారు. అన్నిరంగాల్లో ఏపీని నెం.1గా చేయాలనే లక్ష్యంతో మేమంతా పనిచేస్తున్నాం. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి మూడు కారణాలు ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నిరూపితమైన నాయకత్వం (చంద్రబాబు గతంలో సైబరాబాద్ నిర్మించారు. ఇప్పుడు సైబరాబాద్‌కంటే బెటర్ సిటీని నిర్మించబోతున్నారు), డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఏపీలో ఉండటం. నరేంద్రమోడీ ఆలోచనలకు అనుగుణంగా సంస్కరణల అమలులో ఏపీ ముందువరసలో ఉంది. 3లక్షలమందితో యోగాంధ్ర నిర్వహించి మోడీజీతో అభినందనలు పొందాం. నేడు నమో అంటే నరేంద్రమోడీ కాదు… నాయుడు, మోడీ. భారత్‌కు ఇప్పుడు అత్యుత్తమ నాయకత్వం ఉంది. ఇండియా ప్రపంచంలో నెం.1 ఎకానమీగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు’’ అని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు.
2026 జూన్‌నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
‘‘విశాఖపట్నంలో ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. ఐటి పరిశ్రమలో ఎన్నోమార్పులు వచ్చాయి. రాబోయే మూడేళ్లలో ఐటి సెక్టార్ లో 5లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. 15లక్షల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు పైప్ లైన్ లో ఉన్నాయి. ఫైళ్లను జెట్ స్పీడ్ తో క్లియర్ చేయడం మా ఐటి కార్యదర్శి కాటంనేని భాస్కర్ మెరుపువేగంతో పనిచేస్తున్నారు. 2026 జూన్ నాటకి భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయి…అంతర్జాతీయ కనెక్టివిటీతో ప్రారంభం కాబోతోంది. ఉత్తరాంధ్ర పెట్టుబడులకు గేట్ వేగా మారబోతోంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 16నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాం. ఇది గత పదేళ్లలో వచ్చిన పెట్టుబడుల కంటే అధికం. ఎపికి 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే మా లక్ష్యం. ఈరోజు మన ప్రభుత్వ ప్రయాణంలో ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మంత్రిగా అత్యంత మధురమైన క్షణాలు ఆస్వాదిస్తున్నాను. విశాఖపట్నంలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఎంతో గర్వంగా, సంతృప్తిగా ఉంది ఇవి ఆంధ్రప్రదేశ్ డిజిటల్, ఆర్థిక మార్పును సూచిస్తున్నాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న సైల్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, ఐ స్పేస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, టెక్ తమ్మిన, ఫీనోమ్ పీపుల్, కే రహేజా కార్ప్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ (కపిల్ గ్రూప్) సంస్థల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ మీద ఉంచిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కలిపి రూ. 3,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నాయి. వీటిద్వారా విశాఖపట్నంలో 30వేలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను లభిస్తాయి. ఈ సంస్థల ద్వారా మన యువతకు కొత్త అవకాశాలను కల్పించడమేగాక, ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధిలో వేగం పుంజుకుంటుంది’’ అన్నారు.
20లక్షల ఉద్యోగాలు కేవలం సంఖ్య కాదు
‘‘మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇది కేవలం సంఖ్య కాదు, మనం పూర్తిగా అంకితభావంతో, వేగంగా కొనసాగిస్తున్న లక్ష్యం. అందుకే నేను పరిశ్రమదారులకు ఒక మాట చెప్పాను. మీరు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్న తర్వాత, అది మీ ప్రాజెక్ట్ కాదు, మన ప్రాజెక్ట్ అని. ప్రపంచ ప్రఖ్యాత ఐటి, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్ పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్ ను అత్యంత అనువైన ప్రాంతంగా తయారు చేయడానికి మేము అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మార్చింది మన భాగస్వామ్య సంస్థల తత్వం. %ఱూజూaషవ ూశీట్‌షaతీవ ూశీశ్రీబ్‌ఱశీఅం , ువషష్ట్ర ుaఎఎఱఅa% సంస్థలకు కొద్దరోజుల క్రితం భూమి కేటాయించాం. వారు మనపై విశ్వాసంతో, ధైర్యంగా తమ శంకుస్థాపనకు ముందుకొచ్చారు. ఇది పరిశ్రమదారులు మన పాలనపై ఉంచిన నమ్మకాన్ని, ఆంధ్రప్రదేశ్‌లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సూచిస్తుంది’’ అని స్పష్టం చేశారు.
మేం భవిష్యత్తు నగరాన్ని నిర్మిస్తున్నాం
‘‘ప్రస్తుతం మనది సరికొత్త ఆంధ్రప్రదేశ్. చురుకైన, ఆద్భుతమైన వేగంతో ముందుకెళ్తున్న రాష్ట్రం. విశాఖపట్నాన్ని ఏఐ క్యాపిటల్, డేటా సెంటర్ క్యాపిటల్, ఏఐ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం. మేము కేవలం టెక్నాలజీ పార్కులు, ఆఫీస్ స్పేస్ నిర్మించడమే కాదు, భవిష్యత్తు నగరాన్ని నిర్మిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దూరదృష్టి, క్రమశిక్షణ, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిపై ఆయనకున్న పట్టు మనందరికి ప్రేరణగా నిలుస్తున్నాయి. రేపు, ఎల్లుండి విశాఖపట్నంలో 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ జరగబోతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఇన్నోవేటర్లు పాల్గొనే అంతర్జాతీయ వేదిక. మేం ఈరోజు చేసింది కేవలం సాధారణ శంకుస్థాపనలు కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క డిజిటల్, ఏఐ భవిష్యత్తుకి అంకురార్పణ. మాపై నమ్మకంతో వచ్చిన ప్రతి కంపెనీకి ధన్యవాదాలు.
ఆంధ్రప్రదేశ్‌పై విశ్వాసంతో ఈ చారిత్రాత్మక మార్పులో భాగస్వాములు అవుతున్న ప్రతిఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. మనం కలిసికట్టుగా అవకాశాలు, ఆవిష్కరణలు, లక్షలాది యువతకి నమ్మకాన్ని కల్పిస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ దూరదృష్టికి నిదర్శనం. ఇది ఇంతటితో ఆగకుండా దినదిన ప్రవర్థమానమై మరింత ముందుకు సాగాలి. మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేగవంతమైన, విజ్ఞానవంతమైన, బలమైన శక్తిగా తయారు చేద్దాం’’ అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాఖ ఎంపి ఎం శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, లోకం మాధవి, ఐటి కార్యదర్శి కాటంనేని భాస్కర్, సిఐఐ ఏపీ చైర్మన్ మురళీకృష్ణ, ఏపీ ఐటి అసోసియేషన్ అధ్యక్షుడు కొసరాజు శ్రీధర్, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.














