విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు. విశాఖపట్నంలోని సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ దేశాల రాయబారులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీల్లో భాగంగా గురువారం భారతదేశంలోని ఇటలీ రాయబారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ముఖ్యమంత్రి బార్టోలీకి వివరించారు. కీలక రంగాలైన ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, యంత్రాల తయారీ, ఇంధన, ఫ్యాషన్, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి-ఇటలీ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యంత్రాలు, పునరుత్పాదక విద్యుత్ రంగం, నౌకానిర్మాణ రంగాలలో భాగస్వాములు కావాలని ఇటాలియన్ కంపెనీలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఏపీ-ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ను ఏర్పాటు చేసే అంశంపై సీఎం చంద్రబాబు-ఇటలీ రాయబారి బార్టోలీ మధ్య చర్చలు జరిగాయి.















