- మండపేట నియోజకవర్గం చెన్నూరుకి చెందిన దివ్యాంగుడికి మంత్రి అండ
అమరావతి (చైతన్యరథం): గతంలో ఇచ్చిన మాట మేరకు దివ్యాంగుడికి విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ట్రై స్కూటీ అందజేశారు. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావు.. సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న అభివృద్ధి పనులపై అభినందనలు తెలిపేందుకు గత నెలలో కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి నిమ్మల కార్యాలయానికి దూరాన్ని కూడా లెక్కచేయకుండా వెంకటేశ్వరరావు ఆటోలో వచ్చారు. ఆ సందర్భంగా సీఎం చంద్రబాబుతో ఫొటో దిగాలనే కోరికను వెలిబుచ్చారు. దీంతో అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కోరిక నెరవేరుస్తానని, ట్రై సైకిల్ అందజేస్తామని మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు. దివ్యాంగుడు వెంకటేశ్వరరావు అభిమానానికి చలించిన మంత్రి నారా లోకేష్.. తన సొంత నిధులతో వెంకటేశ్వరరావుకు ట్రై స్కూటీ అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రజాదర్బార్‌లో వెంకటేశ్వరరావును కలిసి ట్రై స్కూటీ స్వయంగా అందజేసిన మంత్రి లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మంత్రి లోకేష్‌ను స్వయంగా కలిసి ట్రై స్కూటీ అందుకోవడం పట్ల వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు.












