అక్రమాస్తుల కేసుల్లో ఏళ్ల తరబడి ఏవో కారణాలు చెబుతూ కోర్టుకు హాజరుకాకుండా గడిపేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఎట్టకేలకు కోర్టు మెట్లు ఎక్కనున్నారు. ఈ నెల 21 లోపు హాజరయ్యేందుకు అనుమతి కోరుతో హైదరాబాద్‌లోని సీపీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని కోర్టు అనుమతించింది. అంతకు ముందు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకాకుండా అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై జగన్ వెనక్కి తగ్గారు. జగన్ అభ్యర్ధనపై అభ్యంతరం తెలిపిన సీబీఐ.. కోర్టుకు రావల్సిందేనని కౌంటర్ దాఖలు చేసింది. దీంతో ఈనెల 21వరకు సమయం ఇస్తే హాజరవుతానని సీబీఐ కోర్టుకు జగన్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లడానికి జగన్‌కు న్యాయస్థానం అనుమతినిచ్చింది. అయితే విదేశాల నుంచి తిరిగి వచ్చాక నవంబరు 14లోగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై.. యూరప్ నుంచి ఎప్పుడు వచ్చారనే వివరాలతో మెమో సమర్పించాలని జగన్‌కు షరతు విధించింది. గత నెల 11 నుంచి 19 వరకు యూరప్ వెళ్లి వచ్చిన జగన్.. తన బదులుగా న్యాయవాది హాజరుకు అనుమతించాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.
లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకైనా అనుమతించాలన్నారు. జగన్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ కోర్టుకు రావాల్సిందేనని.. ఆయన పిటిషన్ కొట్టివేయాలని కోరుతూ కౌంటరు దాఖలు చేసింది. దీంతో వెనక్కి తగ్గిన జగన్.. వ్యక్తిగతంగా హాజరవుతానని కోర్టుకు తెలిపారు. హాజరయ్యేందుకు ఈనెల 21వరకు సమయం ఇవ్వాలని కోరగా.. సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది.
జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ ఏళ్ళ తరబడి కొనసాగుతోందనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, కోర్టుకు రాకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఐదేళ్లు గడిపేశారు. అయితే, ప్రస్తుతానికి ప్రతిపక్ష నేత హోదా కూడా లేని సాధారణ ఎమ్మెల్యే అయిన జగన్ ఇంకా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతుండడంపై పెద్దస్థాయిలో విమర్శలు వచ్చాయి.












