విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్మ సదస్సులో 400 పైగా ఒప్పందాలు కుదురుతాయని.. సుమారు రూ.9 లక్షల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేందుకు అవకాశం ఉందని ఎంపీ శ్రీభరత్ చెప్పారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమ్మిట్ నేపథ్యంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాబోయే వారం రోజుల్లో అనేక శంకుస్థాపనలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల తీరుపై ఎంపీ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా వైసీపీ నేతల వ్యవహార శైలి ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి చెందడం వైకాపాకు ఇష్టం లేదు. పెట్టుబడులు రావడం వారికి నచ్చడం లేదు. పేదలను పేదరికంలోనే ఉంచడం ఆ పార్టీ సిద్ధాంతం. పేదలకు మేలు చేసే పథకాలను రద్దు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సంస్థలను తిరిగి పంపించేశారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ వైసీపీ నేతల తీరులో మార్పు కనిపించడం లేదు. అభివృద్ధి అంటే వైసీపీకి తెలియదు. విధ్వంసం.. నాశనం చేయడంలో పీహెచ్‌డీ చేసిన పార్టీ వైసీపీ. విశాఖలో ప్రపంచస్థాయి పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సమయంలో ఆ పార్టీ నేతలు ర్యాలీలు నిర్వహించడం దేనికి సంకేతం? ఆ పార్టీ తీరును ప్రజలు గమనించాలని ఎంపీ భరత్ అన్నారు.















