అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు లభించిందని, రాజకీయ, ఆర్థిక, సామాజికంగా బీసీల అభ్యున్నతి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను నూతన ఎన్నికైన అమరావతి కురుమ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా శాఖ ప్రతినిధులు సోమవారం మర్యాపూర్వకంగా కలిశారు. పలు సమస్యల పరిష్కారానికి మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వచ్చే ఆదరణ 3.0లో కురమలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడిరచారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నామని, వాటిలోనూ కురమలకు ప్రాముఖ్యతనిస్తున్నట్లు తెలిపారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు సైతం బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు లభించింది టీడీపీ ప్రభుత్వాల హయాంలోనేనన్నారు. బీసీలను జగన్ అణచివేస్తే, సీఎం చంద్రబాబు భుజాన పెట్టుకున్నారని తెలిపారు. నూతనంగా ఎన్నికైన అమరావతి కురుమ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా శాఖ ప్రతినిధులను మంత్రి సవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో నూతన కురమ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు మర్రి వెంకట సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బక్కా ఉమమాహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బి.రామకృష్ణ, ట్రెజరర్ కేవీ సత్యనారాయణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.















