- వాస్తవాలను జీర్ణించుకోలేకే దొంగ సాక్షిలో అడ్డగోలు రాతలు
- కోట్లాది మంది భక్తుల సెంటిమెంటును దెబ్బతీసిన పాపాత్ములు
- అందుకు ఫలితం అనుభవించక తప్పదు
- సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ధ్వజం
నెల్లూరు (చైతన్యరథం): తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడి ప్రసాదం పవిత్రతను భ్రష్టుపట్టించిన వారి పాపాలు పండుతున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్న వాస్తవాలను జీర్ణించుకోలేక దొంగ సాక్షిలో అడ్డగోలుగా వార్తలు వండి వారుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో లీటర్‌కు రూ.20 కమీషన్ తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేయించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయని బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడం అవినీతిలో భాగమే. జగన్ రెడ్డికి హిందూ దేవుళ్లంటే నమ్మకం లేదు. నాటి టీటీడీ చైర్మన్ వైౖవీ సుబ్బారెడ్డిదీ అదే పరిస్థితి అని వింటుంటాం. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిపోయింది. సీబీఐ విచారణతో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవాలను జీర్ణించుకోలేక దొంగ సాక్షిలో రివర్స్ రాతలకు పనిపెట్టారు.
దొంగసాక్షిలో మీకు అనుకూలంగా ఇష్టానుసారం వార్తలు రాసుకున్నంత మాత్రాన పాపాలు చెరిగిపోవని గుర్తుంచుకోవాలి. బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలను సిట్ కోరితే వైవీ సుబ్బారెడ్డి కోర్టుకు ఎందుకెళ్లారు. కుట్రలు చేయకపోతే అంత భయమెందుకో. తిరుమల లడ్డూ అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ను దెబ్బతీసిన వారు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి వస్తుంది. ఏఆర్ డెయిరీకి అర్హత లేకపోయినా నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇవ్వడం కుంభకోణంలో భాగమే. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి తదితరులందరూ ధర్మారెడ్డి సహకారంతో వేల దర్శన టికెట్లు అడ్డగోలుగా పొంది తిరుమలను సంతలా మార్చేశారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో అంతా నిజాయితీతో జరుగుతోంది. కోటాకు మించి ఒక్క సిఫార్సు లేఖను కూడా అనుమతించే పరిస్థితి లేదు. వెంకటేశ్వర స్వామికి అంకితమై బీఆర్ నాయుడు సేవలు అందిస్తున్నారు. టీటీడీని అంకితభావంతో పనిచేసేలా తీర్చిదిద్దారు. రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేయడం కోసమే అప్పట్లో అలిపిరి పేలుడు ఘటనలో చంద్రబాబు నాయుడిని వెంకటేశ్వరస్వామి బతికించారు. ఏడుకొండల వెంకన్న మహత్యానికి అదే నిదర్శనమని సోమిరెడ్డి ఉద్ఘాటించారు.















