- ట్రాఫిక్ నిబంధనల్లో సరికొత్త విధానం అమలు
- ప్రమాదాలు, తొక్కిసలాటల నివారణపై బిగ్ ఫోకస్
- ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన తర్వాతే చలానా విధించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్‌పై ముఖ్యమంత్రి సమీక్షించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి దాని ఆవశ్యకతను వివరించాలని సూచించారు. భారీఎత్తున చలానాలు వేయాలన్న అధికారుల ప్రతిపాదనలను సీఎం సున్నితంగా తిరస్కరించారు. చలానాలు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఈక్రమంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడంవల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ముందుగా హెల్మెట్లు, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించడంతోపాటు… వారు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే విషయాన్ని వారి ఫోన్లకు మెసేజీలు పంపాలని సూచించారు. ఆ తర్వాత కూడా వారి నిబంధనలు ఉల్లంఘిస్తుంటే అప్పుడు చలానాలు వేయాలని స్పష్టం చేశారు. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించిన వారికి తాను తప్పు చేసినందువల్లే చలానాలు వచ్చాయనే భావన కలుగుతుందని సూచించారు. ఇందులో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్ని ప్రమాదాలువంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. ఇలాంటివి జరగ్గకుండా ఉండేలా పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి… నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని నిర్దేశించారు. దీనికి సంబంధించి ఎస్‌ఓపీలను సిద్ధంచేసి వారం రోజుల్లోగా అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. జన సమూహాల్లో తొక్కిసలాటలు జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా రోడ్డు ప్రమాదాలను ఏమేరకు నియంత్రించగలమనే అంశాన్ని కూడా విశ్లేషించాలని చెప్పారు.
రహదారులపై గుంతలు కన్పించకూడదు
పాలనలో తన ప్రాధాన్యతలను ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. రాష్ట్రంలో గుంతలులేని రహదారులు, డ్రైనేజీలు, నీటి నిర్వహణ, ఉద్యోగ, ఉపాధి కల్పన, పంటలకు మద్దతుధర… ఇవే తన ప్రాధాన్యతలని స్పష్టంగా చెప్పారు. అధికారులు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఇప్పటికీ రోడ్లు సరిగా లేవనే ఫీడ్ బ్యాక్ వస్తోందని, అలా జరగకుండా చూసుకోవాలని చెప్పారు. గత పాలనలో రహదారుల నిర్వహణ కూడా పట్టించుకోలేదని… ఆ నిధులను వేరే కార్యక్రమాలకు మళ్లించారని.. అందువల్లే రహదారులు దారుణంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. కారణలేమైనా.. రోడ్లపై గుంతల్లేకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని… తక్షణం ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదేవిధంగా డ్రైనేజీల నిర్వహణ కూడా సరిగ్గా చేపట్టాలని… నిర్వహణ సరిగాలేక నీళ్లు నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నం కాకూడదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహించాలని… వాటిగురించి నిరుద్యోగ యువతకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రైతులు పండిరచిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, రైతులకు సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.
అవినీతి ఉండకూడదు… పనితీరు మెరుగవ్వాలి
ప్రభుత్వం అందిస్తున్న వివిధ పౌరసేవలపైనా ముఖ్యమంత్రి సమీక్షలో చర్చించారు. రిజిస్ట్రేషన్ సేవలు, పారిశుద్ధ్య, రేషన్ పంపిణీ, దీపం-2.0 వంటి పథకాల పనితీరుపై అధికారులతో సమీక్షించారు. గతంతో పోల్చుకుంటే రిజిస్ట్రేషన్ల సేవల విషయంలో పనితీరు కొంతమేర మెరుగైందన్నారు. కొన్నిచోట్ల కొందరు అధికారుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని… దీన్ని సరిచేసుకునేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. రెండున్నర నెలల్లో రిజిస్ట్రేషన్ సేవల్లో తాను ఆశించిన మార్పులు కన్పించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూడాలన్నారు. సమీక్షా సమావేశంలో మంత్రి పార్దసారథి, సీఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.















