- అందుకే నిర్విరామంగా వేట
- వేగం మా ప్రత్యేకత
- ఏపీకి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే మా లక్ష్యం
- రాష్ట్రాలు పోటీ పడితే చివరికి గెలిచేది ఇండియానే
- జాతీయ మీడియాలో సంచలనంగా మారిన మంత్రి లోకేష్ ఇంటర్వ్యూ
- మా రాష్ట్రానికీ లోకేష్‌లాంటి మంత్రి కావాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల పోస్ట్‌లు
అమరావతి (చైతన్యరథం): ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి చూపిస్తున్న వేగం, చొరవ, నిరంతర కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఆయనలాంటి మంత్రి తమ రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండేదని పలువురు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం ఆలస్యంగా తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. అయినప్పటికీ ఇటీవలి కాలంలో ఏపీ తన సామర్థ్యాన్ని మించి భారీ పెట్టుబడులను ఆకర్పిస్తోంది. ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్, డేటా సెంటర్ కోసం గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందం ఒక ప్రధాన మైలురాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్.. పెట్టుబడుల ఆకర్షణకు అమలు చేస్తున్న ప్రత్యేక వ్యూహం, రాష్ట్రాల మధ్య పోటీ, కర్ణాటక మంత్రులతో జరిగిన మాటల యుద్ధంపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘‘మింట్’’కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఇలా ఉంది.
పెట్టుబడులపరంగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించారు?
ఈ సారి మాది అద్భుతమైన ప్రయాణం. గత 17 నెలల్లో సుమారు 120 బిలియన్ డాలర్ల స్థిరమైన పెట్టుబడి కమిట్‌మెంట్లు తెచ్చుకోగలిగాం. ఇది భారతదేశంలో చాలా అరుదైనది. కానీ నేను ఇంకా సంతృప్తిగా లేను. నా లక్ష్యం ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల సాధన. ఆంధ్రప్రదేశ్‌కు ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులకు కమిట్‌మెంట్ సాధించేవరకు నాకు నిద్ర పట్టదు.
రాష్ట్రాల మధ్య పోటీని ఎలా చూస్తున్నారు?
రాష్ట్రాలు పోటీ పడితే ఇండియా గెలుస్తుంది.. ఇదే నా నమ్మకం. ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. కొందరు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తారు, మరికొందరు మంచి ఎకో సిస్టమ్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత వేగం. ‘‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’.. అదే మా రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఇస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకం.
ఈ పోటీ కొన్నిసార్లు మాటల యుద్ధంగా మారుతోంది…
అవును (నవ్వుతూ). ఒక పొరుగురాష్ట్రంలో కొందరు వాడిన పదజాలం ఈ వివాదానికి కారణం. మా పొరుగు రాష్ట్రంలో నేతలు మాట్లాడిన మాటలు మమ్మల్ని రెచ్చగొట్టాయి. అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము చాలా గౌరవంగా వ్యవహరించాం, ఇక కూడా అలాగే వ్యవహరిస్తాం. రాజకీయంగా చిన్న చిన్న వ్యాఖ్యలు ఉంటాయి, కానీ హద్దులు దాటి మాట్లాడటం సబబుకాదు.
అతి ఎక్కువ ప్రోత్సాహకాలపై ఆరోపణలు వస్తున్నాయి
అన్ని రాష్ట్రాలూ ప్రోత్సాహకాలు ఇస్తాయి. ఎవరు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చారు, ఎవరు తక్కువ ఇచ్చారు అనేదే వ్యత్యాసం. అసలు విషయం.. మా సంబంధాల నిర్మాణం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, అద్భుత వేగంతో వాటిని అమలు చేయడం. ఉదాహరణకు ఆర్సెలర్ మిట్టల్ పెట్టుబడి కేవలం ప్రోత్సాహకాల వల్ల రాలేదు. మేము నిజాయితీగా, పారదర్శకంగా పని చేస్తున్నాం. అందుకే గెలుస్తున్నాం. ‘‘చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు’’ అని చెప్పడం సమంజసం కాదు. నిజంగా అలా జరిగితే ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు ఎలా వెళ్తాయి?
99 పైసలకే భూమి ఇస్తున్నారని అంటున్నారు…?
అవును, ఇస్తాం. ఎకో సిస్టమ్ లేని ప్రాంతాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదొక మార్గం. ఇందుకు ఐటీి రంగ పెట్టుబడులు ఉదాహరణ. అలా చేయకపోతే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవి కావు. అవి బెంగళూరు, హైదరాబాద్ లేదా చెన్నైలోనే తమ కార్యకలాపాలను విస్తరిస్తాయి.
ఉద్యోగాల కల్పన కోసం మీరు ఏం చేస్తున్నారు?
అది మా ప్రధాన లక్ష్యం మాత్రమే కాదు… ఎన్నికల మేనిఫెస్టోలో మేం ఇచ్చిన మొదటి హామీ.. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన. పెట్టుబడులు మాత్రమే కాదు, అవసరమైన నైపుణ్యాలు ఉన్న వారిని పరిశ్రమలతో అనుసంధానించేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. నైపుణ్యాల లోపాలను గుర్తించి వాటిని భర్తీచేస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి ఉద్యోగాలు, పెట్టుబడులను ఒక మార్గంగా భావిస్తున్నాం. మా అనుభవజ్ఞుడైన నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దీనిని సాధిస్తాం. ఈసారి ఆయన ఒక యువ బృందాన్ని నడుపుతున్నారు. మేమంతా ఆయన నేతృత్వంలో పని చేస్తున్న క్షిపణులం, ఆయన మా జీపీఎస్.. మా లక్ష్యాలకు చేరేందుకు ఆయన దారి చూపిస్తున్నారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఇలా ఉంటే ఈ ఇంటర్వ్యూను కోట్ చేస్తూ లోకేష్ లాంటి మంత్రి మా రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండును అంటూ నెటిజన్లు ట్వీట్లు, ఫేస్ బుక్‌లో పోస్టులు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.















