- విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం
- 26 జిల్లాల కేంద్రాల్లో మైనారిటీ సంక్షేమ దినోత్సవం నిర్వహణ
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం
- రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ వెల్లడి
- భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల నిర్వహణపై మంత్రి సమీక్ష
అమరావతి (చైతన్యరథం): భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీన మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నది. ఇందుకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లు, కార్యాచరణ అమలుకు సంబంధించిన అంశాలపై మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో సుదీర్ఘంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ చర్చించారు. ఆదివారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి యాకుబ్ భాష, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి ఏ. శేఖర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గౌస్ పీర్, వక్ఫ్ బోర్డు సీఈవో మహమ్మద్ అలీ, మైనారిటీ కమిషన్ కార్యదర్శి నిజాముద్దీన్, తదితరులతో మైనారిటీ, జాతీయ విద్యా దినోత్సవం విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఫరూక్ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
రాష్ట్రంలోని 26 జిల్లాల కేంద్రాలలో కూడా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యాచరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. భారత స్వాతంత్ర సమరయోధుడు, దేశ మొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ కృషితో దేశంలో అత్యున్నతమైన విద్యా వ్యవస్థ ఉన్నతికి పునాదులు పడ్డాయన్నారు. మహనీయుడు ఆజాద్ జయంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ఉర్దూ భాషాభివృద్ధికి విశిష్ట కృషి చేసిన వారికి అవార్డులు, జీవిత సాఫల్య అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అవార్డులను అందజేయనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.















