- మార్మోగిన ‘డబుల్ ఇంజిన్’ నినాదం
- దూసుకుపోయిన ‘ఫిర్ ఏక్ బార్ నాని గవర్నమెంట్’ పిలుపు
- ఒక్కఛాన్స్ పేరుతో గతంలో ఏపీ ప్రజలు చేసిన తప్పు చేయవద్దని యువతకు హితవు
- ఇంగ్లీష్, హిందీలో అనర్ఘళ వాగ్దాటి
- యువనేత లోకేష్ ప్రచారానికి భారీ స్పందన
అమరావతి (చైతన్యరథం): బీహార్‌లో యువనేత లోకేష్ ప్రచారానికి మంచి స్పందన లభించింది. ఈ నెల 8, 9 తేదీల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఎన్డీఏ నేతలు లోకేష్ రాకను స్వాగతిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని ‘‘డబుల్ ఇంజిన్’’ ప్రభుత్వాన్ని కొనసాగించాలనే ఆయన పిలుపు కూటమి ఐక్యతకు బలం చేకూర్చిందని ప్రశంసించారు. స్థానిక పార్టీ నేతలు తమలో కొత్త ఉత్సాహం వచ్చిందని, ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించడానికి ఆయన ప్రచారం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశానికి చెందిన బలమైన యువనేతగా ఉత్తరాది రాష్ట్రంలో ప్రచారం చేయడం, ఎన్డీఏ డబుల్ ఇంజిన్ విధానాన్ని నొక్కి చెప్పడానికి వ్యూహాత్మకంగా పనికొచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఒక్క చాన్స్ అని అడిగితే అవకాశం ఇచ్చి ఏపీ ప్రజలు నష్టపోయారని బీహార్ ప్రజలు అలాంటి తప్పు చేయవద్దని పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. దానివల్ల మా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని బీహార్ యువతకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. జంగిల్ రాజ్ అయితే ఎలా అవుతుందో ఏపీలో ఐదేళ్లు ప్రత్యక్షంగా చూసి, ఒక భారతీయుడిలా బాధ్యతతో అక్కడి ప్రజలకు చెప్పారా అన్నట్లుగా లోకేష్ తాజా పిలుపు ఉంది.
ప్రస్తుతం నారా లోకేష్ చేసిన నినాదం.. ఎక్కువగా వినిపిస్తుండడం విశేషం. ఏపీలో నమో సహకారంతో దూసుకుపోతున్నాం. డబుల్ ఇంజన్ సర్కారు కాదు.. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఏపీలో నడుస్తోందని లోకేష్ తన ప్రసంగాల్లో చెప్పారు. దీనికి కొనసాగింపుగా.. బీహార్‌లో నాని.. సర్కారు రాకెట్ వేగంతో ముందుకు సాగుతోంది.. అని నారా లోకేష్ అన్నారు. తొలిసారిగా ఈ మాట విన్న ఎన్డీఏ నేతలు కొంత ఆశ్యర్యానికి గురయ్యారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు. నాని.. అంటే ఏంటని అడిగారు. దీంతో నారా లోకేష్ చిరునవ్వు నవ్వి.. ‘‘నా అంటే.. నరేంద్ర మోదీ, ని అంటే .. నితీష్ కుమార్.. అని చెప్పడంతో అందరూ శెభాష్ అన్నారు. ఆ వెంటనే దీనిని ఎన్నికల స్లోగన్‌గా మారుస్తామని స్థానిక నేతలు చెప్పారు. దీంతో ప్రచారం ముగింపు దశలో ఫిర్ ఏక్ బార్ నాని గవర్నమెంట్.. నినాదం బుల్లెట్‌లా దూసుకెళ్లింది.
లోకేష్ తన ప్రచార సందేశంలో అభివృద్ధి, ఎంటెర్‌ప్రెన్యూర్‌షిప్ పై ప్రధానంగా దృష్టి సారించారు. ఉచితాలు లేదా కేవలం ప్రభుత్వ ఉద్యోగాల హామీల కంటే స్థిరమైన వృద్ధికి, యువత సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన బీహార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న హామీలకు భిన్నంగా, లోకేష్ ఇచ్చిన ఈ అభివృద్ధి-కేంద్రీకృత సందేశం బీహార్‌లోని వ్యాపార వర్గాలతో పాటు, అభివృద్ధిని కోరుకునే ఓటర్లలో ఆసక్తిని రేకెత్తించింది. బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పారిశ్రామికవేత్తలతో ఆయన జరిపిన సమావేశాలు, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి ఉందనే సంకేతాన్ని ఇచ్చాయి. బీహార్‌లో నివసించే తెలుగు మాట్లాడే వలస సమాజం, వ్యాపార వర్గాలు ఆయన పర్యటనను సానుకూలంగా స్వాగతించాయి.
వికసిత్ భారత్ సాధనలో బీహార్ చాలా కీలకమని అందుకే ఎన్డీఏను గెలిపించాలని మంత్రి లోకేష్ చెప్పారు. ఏపీ మంత్రిగా రాలేదని.. ఓ బాధ్యత గల పౌరుడిగా వచ్చానన్నారు. బీహార్ యువత మరోమారు ఎన్‌డీఏని ఎందుకు గెలిపించాలో చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం ఎన్‌డీఏని గెలిపించాలన్నారు. బీహార్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండటం వల్ల కేంద్రబడ్జెట్‌లో భారీగా నిధులు లభిస్తున్నాయని గుర్తు చేశారు.
గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి.. బీహార్‌లో జంగిల్ రాజ్ పాలన పోయి నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగుండటంతో పాట్నా ఎంతో అభివృద్ధి సాధించిందని బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు చెప్పారన్నారు. ఇంటికో ఉద్యోగం కాదని.. ఇంటికో పారిశ్రామిక వేత్త రావాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉండటంతో పెద్దఎత్తున అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందన్నారు.
బీహార్‌లో లోకేష్ ప్రచారానికి జాతీయ స్థాయిలో విస్తృత కవరేజీ లభించింది. లోకేష్ హిందీ ప్రసంగాలు, మోదీ-నితీష్ నాయకత్వంపై ఆయన ప్రశంసలు, ప్రతిపక్షాల అలవికాని హామీలపై ఆయన చేసిన విమర్శలు ముఖ్యాంశాలుగా నిలిచాయి. నారా లోకేష్ అటు ఇంగ్లీష్.. ఇటు హిందీల్లో అనర్ఘళంగా మాట్లాడారు. ఎక్కడా తడబాటు లేకుండా.. జాతీయ మీడియాతో ఇంగ్లీష్‌లోను.. స్థానిక బీహార్ మీడియాతో హిందీలోనూ మాట్లాడారు. ఇక, ఎన్డీయేకు చెందిన బీహార్ నాయకులతో ఆయన పూర్తిగా స్థానిక హిందీలోనే సంభాషించి ఆకట్టుకున్నారు.
















