నెల్లూరు (చైతన్యరథం): నెల్లూరు ప్రజలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. ఎన్నో ఏళ్ల ప్రజల కలను సాకారం చేస్తున్న మంత్రి నారాయణ నిరంతర కృషికి ఆ ప్రాంతవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నెల్లూరులో ట్రాఫిక్ కు ప్రధాన సమస్యగా ఉన్న చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డుకు మంత్రి చొరవతో మోక్షం లభించింది. ఈ ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళుతుండటంతో పాటు నెల్లూరు నుండి పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతోపాటు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో హైవేపై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చించారు. మంత్రి నారాయణ చూపిన చొరవతో ఏళ్ల నాటి కల త్వరలో సహకారం కానుంది. చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా రూ.121 కోట్ల నిధులను మంజూరు చేయించి చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీంతో నెల్లూరు నగర వాసులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రమాదాల నివారణతో పాటు రాకపోకలకు అలువుగా ఉంటుందని ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేశారు.















