- సత్సంకల్పంతో అడుగులు ముందుకేస్తున్నాం
- పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తి సహకారం
- ‘కుప్పం’లో 7 పరిశ్రమలకు సీఎం వర్చువల్ శంకుస్థాపన
- రూ.2,203 కోట్లతో ఏర్పాటు కానున్న పరిశ్రమలు,
- 22,330 మందికి ఉద్యోగాలు, ఉపాధికి అవకాశం
- త్వరలో రూ.6,339 కోట్లతో మరో 8 సంస్థలు
- ముందస్తుగా ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): అన్నిరంగాల్లోనూ రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో వెనుకబడిన కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతామని అన్నారు.
అమరావతినుంచి వర్చువల్ విధానంలో కుప్పంలో 7 పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హిందాల్కో శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోయా, మదర్ డైరీ, ఇ-రాయస్ ఈవీ, అలీప్ పరిశ్రమలు కుప్పంలో రూ.2,203 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. తద్వారా 22,330 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఈ ఏడు సంస్థలకు 241 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. పరిశ్రమల శంకుస్థాపన సందర్భంగా స్థానిక ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులతో ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామని, తన అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన ఆమోదం ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
త్వరలో కుప్పం నియోజకవర్గానికి రూ.6,339 కోట్ల పెట్టుబడితో మరో 8 సంస్థలు రాబోతున్నాయని, వీటిరాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 43 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాయలసీమ జిల్లాల్లో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరో స్పేస్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎం చెప్పారు. స్థానికంగా ఉన్న యువతకు స్కిల్ డెవలప్మెంట్ కల్పించేలా హిందాల్కో సంస్థ యూనిట్ను ఏర్పాటు చేయనుందని సీఎం తెలిపారు. రూ.586 కోట్లతో శిక్షణా టెక్నికల్ లెక్షణా కేంద్రాన్ని హిందాల్కో నెలకొల్పనుంది. రూ.290 కోట్ల వ్యయంతో సమీకృత డెయిరీ, పశు మేత ప్లాంట్ను శ్రీజా డెయిరీ సంస్థ ఏర్పాటు చేయనుందని.. తద్వారా స్థానిక మహిళలకు, పాడి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. డెయిరీ పోటీన్ తయారీ కోసం ఏస్ ఇంటర్నేషనల్ రూ.525 కోట్ల పెట్టుబడిని పెట్టనుందని వెల్లడించారు. ఇక స్థానికంగా 2 లక్షలమంది రైతులకు ప్రయోజనం కల్పించేలా ఎస్వీఎఫ్ సోయా సంస్థ రూ.373 కోట్ల వ్యయంతో ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. వండ్లు ఉత్పత్తి చేస్తున్న రైతులకు ప్రయోజనం కల్పించేందుకు మదర్ డైరీ సంస్థ రూ.260 కోట్ల పెట్టుబడి కొట్టనుంది. జ్యూస్, జామ్, పల్ప్ యూనిట్ను మదర్ డైరీ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. ఎలక్ట్రిక్ ఆటోలు, ద్విచక్ర వాహనాలు తయారీ సంస్థ ఇ-రాయస్ ఈవీ అడ్వాన్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తోందని.. రూ.200 కోట్లతో ప్లాంట్ ప్రారంభం కానుందని తెలిపారు. గ్రీన్ మొబిలిటికి కేంద్రంగా కుప్పం మారుతుందన్నారు. స్వయం సహాయ సంఘాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలకు ఉపకరించేలా రూ.27 కోట్లతో పారిశ్రామిక పార్కును అలీప్ సంస్థ ఏర్పాటు చేయనుందన్నారు. 40 వేల చదరపు అడగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ మహిళా శక్తి భవన్లో 4 వేలమంది మహిళలకు ఉపాధి, శిక్షణ అవకాశాలు కలుగుతాయని అన్నారు.
మంచి పబ్లిక్ పాలసీలు చరిత్రను తిరగరాస్తాయి
కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రజలతో సీఎం మాట్లాడుతూ “ప్రతి మహిళ, ప్రతి యువత ఒక పారిశ్రామికవేత్త కావాలి. పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చారన్నది ముఖ్యం కాదు. ఉన్నత విద్య ద్వారానే ప్రయోజకత్వం వస్తుంది. ఈ ఏడాదిలో డ్వాక్రా, మెప్మా సంఘాలనుంచి లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వన్ ఫ్యామిలి-వన్ ఎంటర్ప్రైస్యూర్, వన్ ఫ్యామిలీ-వన్ ఏఐ నిపుణులు అనే పాలసీలు చరిత్రను తిరగరాస్తాయి. ప్రతి పరిశ్రమా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలి. 100 శాతం సౌద విద్యుత్ వినియోగించుకునే నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తున్నాం. తమిళనాడు, కర్ణాటకలకు అనుసంధానంగా ఉన్న కుప్పానికి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. కుప్పం నుంచి వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఎయిర్ కనెక్టివిటీ పెంచుతాం. అలాగే బ్యాటరీ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, లాజిస్టిక్స్, ఫుట్ వేర్, ఇన్నోవేషన్ హబ్గా కుప్పం రూపుదిద్దుకోనుంది. పబ్లిక్ పాలసీలతో చరిత్రను తిరగరాయవచ్చు. స్థానిక ఉత్పత్తులను.. స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకునే అవకాశాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
“కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్సు అమలు చేశాం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచాం. రైతులంతా ప్రకృతి వ్యవసాయంవైపు దృష్టి సారించాలి. హంద్రీ నీవా ద్వారా నీటిని కుప్పంవరకు తీసుకువచ్చి అందరి కలను నిజం చేసి చూపించాం. భవిష్యత్లో కుప్పానికి తాగు, సాగు నీటి సమస్య ఉండదు. మనం తీసుకునే ఆహారం, ఆలోచన విధానంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే టాటా సంజీవని ద్వారా 57,545 ఆరోగ్య సేవలు అందించాం. కుప్పం పరిధిలో 400 ఈ-సైకిళ్లను స్వయం సహాయ సంఘాలకు చెందిన సభ్యులకు ఇచ్చాం. స్వర్ణ కుప్పం సాధనలో భాగంగా చెత్త సేకరణకు 130కి పైగా ఎలక్ట్రిక్ సీఎన్జీ ఆటోలు వినియోగంలోకి తెచ్చాం. కుప్పం సెంట్రల్ పార్క్, వచ్చే ఏడాదిలో డీకే పల్లి పార్క్, మోడల్ బస్ స్టేషన్, ఎన్టీఆర్ స్పోర్ట్ కాంప్లెక్స్ సిద్ధం అవుతాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా రాష్ట్రంలోనే తొలి జీరో – ల్యాండ్ఫిల్ నియోజకవర్గంగా కుప్పం నిలుస్తుంది. సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధించాం. నెట్-జీరోనే లక్ష్యంగా ముందుకెళు న్నామని” సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
స్థానికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
అతకుముందు కుప్పం స్థానిక రైతులు, ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా మాట్లాడారు. పరిశ్రమలు స్థాపించడం ద్వారా తమకు ఉపాధి కల్పించినందుకు ముఖ్యమంత్రికి కుప్పంవాసులు ధన్యవాదాలు తెలిపారు. కుప్పానికి ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తాయని కలలో కూడా అనుకోలేదని.పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల రాకతో తమ ఉత్పత్తులను స్థానికంగా విక్రయించే అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రికి రైతులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.















