- ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాల అభివృద్ధి
- డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ వల్లే ఏపీకి భారీ పెట్టుబడులు
- అవినీతిరహిత, కమిట్మెంట్ లీడర్షిప్ వల్లే బీహార్ అభివృద్ధి
- బీహార్ పారిశ్రామికవేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ భేటీల్లో మంత్రి నారా లోకేష్
పాట్నా (చైతన్య రథం): రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…. “దేశప్రజలు ప్రధానిగా సరైన సమయంలో సరైన నేతను ఎన్నుకున్నారు. దీంతో గత పదేళ్లుగా భారతదేశం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా బీహార్ కూడా నితీష్ కుమారు ముందు, తర్వాత అన్నవిధంగా అభివృద్ధి సాధించింది. సమర్థవంతమైన నాయకుడివల్లే బీహార్ అభివృద్ధి సాధిస్తోంది. లీడర్షిప్ ట్రాక్ రికార్డుతోపాటు శాంతిభద్రతలు, మహిళల భద్రత, అవినీతి రహితపాలనే ఇందుకు కారణం. కేంద్ర, రాష్ట్ర సత్సంబంధాల విషయంలో ఏపీ, బీహార్ కు సారూప్యతలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బులెట్ సర్కారు కారణంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. చిన్న రాష్ట్రమైనప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్లే మా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి” అని పేర్కొన్నారు.
“భారత్లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏపీకి రావడానికి ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీవైష్టవ్ల సహకారం కూడా కీలకంగా ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పాజిటివ్ లీడర్ షిప్, టాక్సేషన్లో మార్పుల కారణంగా కేవలం 12 నెలల్లో ఏపీకి గూగుల్ సంస్థను రప్పించగలిగాం. అలాగే దేశంలో అతిపెద్ద ఉక్కు పరిశ్రమను ఆర్సెలర్స్ మిట్టల్ ఏపీలో ఏర్పాటు చేయబోతోంది. వారిని రాష్ట్రానికి ఆహ్వానించినపుడు మూడు ప్రధాన సమస్యలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానితో మాట్లాడటంతో వెనువెంటనే ఆ మూడు సమస్యలు పరిష్కరించారు” అని లోకేష్ స్పష్టం చేశారు.
“ఆంధ్రప్రదేశ్ను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఇందుకోసం మా ముఖ్యమంత్రి విజన్ 2047 డాక్యుమెంట్ను రూపొం దించి, లక్ష్యాలను నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం పీపీఏలను రద్దుచేయడంవల్లే ఈసారి పెట్టుబడుల సాధనకు పదిరెట్లు కష్టపడాల్సి వస్తోంది. రాష్ట్రాలు వేగవంతమైన అభివృద్ధి సాధించాలంటే లీడర్షిప్ ట్రాక్ రికార్డుతోపాటు ప్రభుత్వాల కొన సాగింపు కూడా ముఖ్యం. గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాల ప్రభుత్వాల కొనసాగింపువల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాపై ఎంతో నమ్మకంతో 94శాతం సీట్లతో మమ్మల్ని గెలిపించారు. ఏపీలో యువతకు ఉద్యోగాలు కల్పించడం ప్రస్తుతం మా ముందున్న ప్రధాన లక్ష్యం. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. త్వరలో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించబోతున్నామని మంత్రి లోకేష్ ప్రస్తావించారు. సమావేశంలో బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు రాంజీ, గోయంకా, మాజీ ఎంపి జివిఎల్ నరసింహారావు, రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు, బీహార్ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
ఏపీలో వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రైన్యూర్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం
పాట్నాలో బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీహార్ లో మొదటిసారి పర్యటిస్తున్నానని, ఏపీ మంత్రిగా బీహార్కు రాలేదని భారతీయుడిగా వచ్చానన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీష్ సమర్థ నాయకత్వంపై నమ్మకముందన్నారు. బీహార్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించాలని ఇక్కడి ప్రజలను కోరేందుకు వచ్చాను. ఏపీలో అభివృద్ధి కోసం ఎన్డీయేసు 94శాతం స్ట్రైక్ రేట్తో ప్రజలు గెలిపించారు. బీహార్లో కూడా ఇదే విధమైన ఫలితాలు పునరావృతం కావాలని కోరుకుంటున్నాను. ఎన్డీయే భాగస్వామిగా, దేశ పౌరుడిగా ఇది నా బాధ్యత. ఏపీలో వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రైన్యూర్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఇక్కడ ప్రతిపక్షం ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అని మాట్లాడుతున్నారు. ఇది సాధ్యం కాదు. బీహార్లో మరోసారి ఎన్డీయే విజయం సాధిస్తుందని లోకేష్ స్పష్టం చేశారు.















