- పనిచేసిన కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవులిస్తున్నాం
- శవరాజకీయాలు వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య
- ఆ పార్టీ ఫేక్ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పకొట్టండి
- కూటమి కార్యకర్తలతో కలసికట్టుగా ముందుకు సాగండి
- కళ్యాణదుర్గం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత లోకేష్
కళ్యాణదుర్గం (చైతన్యరథం): గత 16నెలల పాలనలో మనం చేసిన మంచిని ప్రజలకు చెప్పుకోవాలి, ప్రజలతో మమేకం కావాలి…. ఇకపై యావత్ పార్టీ కేడర్ క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలను కలవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో శుక్రవారం యువనేత లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.4వేల పెన్షన్, చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తున్నాం. ఒక్క పెన్షన్లపైనే రూ.40వేల కోట్ల ఖర్చుపెడుతున్నాం. ఇకపై ప్రతి మూడునెలలకు ఒక కార్యక్రమం ఇస్తాం. వీటన్నింటినీ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక కేసులు పెట్టించుకుని ఇబ్బందిపడ్డారు, దెబ్బలు తిన్నారు, పనిచేసేవాళ్లను గుర్తించేందుకే ఈరోజు ఉత్తమ కార్యకర్తలతో భేటీ అవుతున్నామని లోకేష్ తెలిపారు.
పార్టీని నిర్లక్ష్యం చేయవద్దు
పార్టీ సభ్యత్వం, మన టీడీపీ, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ వంటి కార్యక్రమాల్లో ప్రతిభ చూపినవారిని గుర్తించే వేదిక ఇది. ఇది ఇక్కడితో ఆగదు, మరింత ముందుకు తీసుకెళ్తాం, ఇప్పుడు మన టీడీపీ వచ్చింది. పనిచేసిన వారిని జల్లెడబట్టి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాం. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో కేడర్ భాగస్వాములు కావాలి, ప్రజలకు దగ్గర కావాలి. మన పార్టీలో చేసింది చెప్పుకోలేని జబ్బు ఉంది. మనం అధికారంలోకి వచ్చాక చేసింది చెప్పుకోం. నాతో సహా ప్రజల కోసం ఏదో చేద్దామని చూస్తాం తప్ప.. చేసింది చెప్పుకోం. ఈ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కియా మోటార్స్ తెచ్చినప్పటికీ ప్రజలకు చెప్పుకోలేకపోవడం వల్లే 2019లో ఓడిపోయాం. అధికారంలో ఉన్నపుడు సహజంగానే వత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడకు వెళ్లినా చివరికి తిరిగిరావాల్సింది పార్టీ వద్దకే. పార్టీ శాశ్వతం అన్న విషయాన్ని కార్యకర్తలు మరువద్దు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని నిర్లక్ష్యం చేయొద్దని లోకేష్ ఉద్బోధించారు.
చేసింది చెప్పకపోవడమే బలహీనత
రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆ నియోజకవర్గంలో కేడర్ ను కలిశాకే అధికారిక కార్యక్రమానికి వెళ్తున్నా. అధినేత చంద్రబాబు కూడా ఎంత పని వత్తిడి ఉన్నా కార్యకర్తలతో మాట్లాడాకే తిరిగివెళ్తున్నారు. కార్యకర్తలంతా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేవుడు కూడా అందరి సమస్యలు, కోర్కెలు, తీర్చలేరు. అంతమాత్రాన అలక వహించవద్దు. మనది పెద్ద ఉమ్మడి కుటుంబం. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. పార్టీలో అంతర్గతంగా జగన్ పైకంటే ఎక్కువగా మీ కోసం నేను పోరాడతాను. పార్టీలో సంస్కరణలు తెచ్చేందుకు పోరాడాను. కొంతమంది పని జరగకపోతే సోషల్ మీడియా ఎక్కుతున్నారు, అది మంచి పద్ధతి కాదు. మనం పోరాడాల్సింది మన రాజకీయ ప్రత్యర్థి వైసీపీితో మాత్రమే. మనలో ఉన్న బలహీనత చేసిన మంచిని సరిగా చెప్పలేం. వైసీపీ వాళ్లు చేయనిది కూడా బలంగా చెబుతారని లోకేష్ గుర్తు చేశారు.
వైసీపీ శవరాజకీయాలు…
వైసీపీ వారికి శవరాజకీయాలు వెన్నతోపెట్టిన విద్య. శ్రీకాకుళం గుడి ఘటనలో 9మంది చనిపోయారు. స్వామిని ప్రజల వద్దకు తీసుకొచ్చేందుకు 94 సంవత్సరాల వృద్ధుడు పాండా రూ.20 కోట్లు పెట్టి గుడికట్టారు. అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవటంతో దురదృష్టకర ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే నేను, కేంద్రమంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్న, అనిత హుటాహుటిన అక్కడకు వెళ్లాం. వైసీపీ వాళ్లు ఆ సమయంలో పాండా వ్యాఖ్యలను ఎడిట్ చేసి అనుమతి కోరితే ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారం చేశారు. మన తెలుగుబిడ్డ, క్రికెటర్ శ్రీచరణిని 3నెలల క్రితం విశాఖలో కలిశాను. బాగా ఆడాలని ప్రోత్సహించాను. వరల్డ్ కప్‌లో విజయం సాధించాక చెల్లెమ్మకి మంచి రివార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ లోగానే వైసీపీ వారు అక్కడ కూడా కులం ప్రస్తావన తెచ్చేందుకు ప్రయత్నించారు. తాజాగా ఉండవల్లిలో శ్రీచరణి నన్ను కలిసినపుడు 24గంటలు ఎలా కష్టపడుతున్నారని అడిగింది. రాజకీయాల్లో మార్పు తేవాలంటే కష్టపడి పనిచేయక తప్పదు. గతంలో 32మంది కమ్మ డీఎస్పీలకు ప్రమోషన్ ఇచ్చామని వైసీపీ వాళ్లు తప్పుడు ప్రచారం చేశారు. చివరకు నలుగురు మాత్రమే ఉన్నారని తేలింది. అధినేత చంద్రబాబుని ఆదర్శంగా తీసుకొని అలసట వీడి ముందడుగు వేయండి. ప్రతిపక్షంలో ఉన్నా, అధకారంలో ఉన్నా ఆయన రేయింబవళ్లు కష్టపడతారు. ఇటీవల నేను ప్రధాని మోదీని చూసి ఆశ్చర్యపోయా. 75ఏళ్ల వయసులో కూడా ఎంతో కష్టపడుతున్నారు. అందుకే వారిలో వయోభారం కనపడదని లోకేష్ అన్నారు.
గతంలో పడిన కష్టాలను మరువద్దు
పార్టీలో సమస్యలుంటే పరిష్కరించడానికి ఎంపీి, ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జి మంత్రి, నేను ఉన్నా. నేను కూడా ఇకపై వారానికి ఒకరోజు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటా. పార్టీ పిలుపు ఇచ్చే అన్ని కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలుచేస్తూ, చేసింది సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్తే 2029 ఎన్నికల్లో కూడా జయం మనదే. అధికార గర్వం, అహంకారం వీడి టీమ్ వర్క్‌గా పనిచేయాలి. మంత్రులందరం రాష్ట్రానికి మేలు చేయాలనే తపనతో పనిచేస్తున్నాం. అధికారంలోకి వచ్చాం కదా అని గతంలో మనం పడిన కష్టాలను మరువద్దు. నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. చంద్రబాబుని 53రోజులు అక్రమగా నిర్బంధించారు. ఉత్తమ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. నామినేటెడ్ పదవుల్లో ఇప్పుడు మొదటిరౌండ్ మాత్రమే పూర్తయింది. మరో రౌండ్ ఉంది, కంగారు వద్దు. పనిచేస్తూ వెళ్తే పార్టీ మిమ్మల్ని కచ్చితంగా గుర్తిస్తుంది. నేను మర్చిపోయినా చంద్రబాబు మిమ్మల్ని మర్చిపోరని లోకేష్ భరోసా ఇచ్చారు.
కూటమి కార్యకర్తలతో కలసివెళ్లండి
చిన్నచిన్న విభేదాలున్నా కూటమి పార్టీల కార్యకర్తలతో కలసికట్టుగా ముందుకెళ్లాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వాన్ని బేషరతుగా బలపరుస్తున్నాం. భవిష్యత్తులో కూడా మూడు పార్టీలు కలిసే ఉంటాయి. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని పట్టించుకోవద్దు. అధికారం పోయాక వారు అసెంబ్లీనుంచి పారిపోయారు. చంద్రబాబు సింహంలా సింగిల్‌గా నిలబడి పోరాడారు. నాయకుడంటే అలా ఉండాలి. వైసీపీ ఫేక్ బ్యాచ్‌ని ఎవరూ నమ్మరు. ఎర్రబుక్కును ఎగతాళి చేసినవారి పరిస్థితి ఏమిటో మీరంతా చూస్తున్నారు. పార్టీ కేడర్‌ను ఇబ్బందులు పెట్టిన వారెవరినీ వదిలే ప్రసక్తిలేదు. కార్యకర్తలంతా రేయింబవళ్లు కష్టపడాలి. కలసికట్టుగా పనిచేద్దాం, పోరాడదాం. నేను, చంద్రబాబు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతాం. ఓర్పు సహనంతో ముందుకెళదాం. మీ ఎమ్మెల్యే ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఉన్నారు. ఆయనకు ఇవ్వడం తప్ప చేయి చాపే అలవాటులేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. రూ.12లక్షల కోట్ల అప్పు ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థతవల్లే నెగ్గుకురాగలుతున్నాం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని యువనేత లోకేష్ ఉద్ఘాటించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టీజీ భరత్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం ఎంపీి అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం పార్లమెంటు ఇన్చార్జి వెంకటశివుడు, జోనల్ కోఆర్డినేటర్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని), తదితరులు పాల్గొన్నారు.












