- చివరిరోజు మూడు కంపెనీల ప్రతినిధులతో భేటీ
- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
దుబాయ్ (చైతన్యరథం); దుబాయ్ లో పురపాలక మంత్రి నారాయణ బృందం మూడురోజుల పర్యటన బుధవారంతో ముగిసింది. ఏపీలో పెట్టు బడులు పెట్టేందుకు దుబాయ్ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి ఈ మేరకు మంత్రి నారాయణతో ఆయా కంపెనీల ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించారు. మూడో రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం దుబాయ్ లోని షార్జా బాంబర్ కు వెళ్లారు. ఇక్కడ బీఆ ఫెసిలిటీ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ కంపెనీ వేస్ట్ మేనేజ్ మెంట్, రికవరీ ప్లాంట్ ఏర్పాటుతో పాటు వైద్య రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, ప్రాసెసింగ్ చేస్తున్న విధానాన్ని బీఆ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలను డంపింగ్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు వెళు తున్న అంశాన్ని మంత్రి కంపెనీ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. మధ్యాహ్నం అజ్మాన్లో టెక్టాన్ ఇంజినీరింగ్ అండ్ కనస్ట్రక్షన్ కంపెనీ ఎండీ ఎస్. లక్ష్మణ్ సమావేశమయ్యారు. విద్యుత్, ఆయిల్, గ్యాస్తో పాటు భారీ నిర్మాణాల ప్రాజెక్ట్లల్లో ఈ కంపెనీకి 22 ఏళ్ల అనుభవం ఉంది. రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ల నిర్మాణంలో ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రాజెక్టులు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరగుతున్న అభివృద్ధి, గత 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టుల వివరాలతో పాటు అమరావతి నిర్మా ణం గురించి టెక్టాన్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. అమరావతి నిర్మాణంలో పలు ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వా మ్యం కావాలని మంత్రి కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు టెక్టాన్ కంపెనీ ఆసక్తి కనబరిచింది. సాయంత్రం దుబాయ్ లోని కార్బోనాటిక్.. కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. అమెరికా కేంద్రంగా ఉన్న ఈ సంస్థ మైనింగ్, విద్యుత్ రంగాలతో పాటు షిప్ బిల్డింగ్, ఇన్లాండ్ వాటర్ వేస్, ఏవియేషన్ ప్రాజెక్టులలో ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. శ్రీలంక, జాంబియాతో పాటు 5 దేశాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఏపీలో నౌకల నిర్మాణం, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కార్బోనాటిక్ సంస్థ ఆసక్తి కనబరిచింది. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు కంపెనీల ప్రతినిధులను హాజరుకావాలని ఆహ్వా నించారు.. దుబాయ్ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రికి మంత్రి నారాయణ బృందం హైదరాబాద్ చేరుకుంది. మంత్రి వెంట సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు.












