లండన్ (చైతన్యరథం; ఒక సముద్రంలా.. ఒక సూర్యుడిలా వనరుల్ని, సేవలను సమాజంలో అందరికీ సమానంగా అందిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు ముందుకు సాగుతోందని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలకు.. లండన్లోని ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ నుంచి విశిష్టవ్యక్తిగా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును, అదే విధంగా హెరిటేజ్ ఫుడ్స్క ఎక్స్టెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరి మంగళవారం రాత్రి అందుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్టు తరపున సంజీవని ఫ్రీ హెల్త్ క్లీనిక్స్, మొబైల్ హెల్త్ క్యాంప్స్, సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వటంతో పాటు వారి సామర్థ్యాలు పెంచేలా నైపుణ్య శిక్షణ ఇస్తూ మహిళా సాధికారిత కోసం పనిచేస్తున్నాం. ప్రకృతి విపత్తుల సమయంలో బాధతులకు అండగా నిలుస్తున్నాం. వారి జీవితం సాధారణ స్థాయికి వచ్చేంత వరకూ చేయూత అందిస్తున్నాం.
ఏపీ, తెలంగాణా సహా వివిధ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆపన్నులకు సాయం అందిస్తున్నాం. సమాజంలో ప్రజలు సక్రమంగా పోషకాహారం తీసుకునేలా, వ్యక్తిగతంగా పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకునేలా ట్రస్టు తరపున సేవలు అందిస్తున్నాం. ప్రజల జీవన విధానంలో మార్పు చేర్పులకు సంబంధించిన అంశాల్లోనూ సలహాలను అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు కృషి చేస్తున్నాం. వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకునేలా వారికి ట్రస్టు తరపున విలువైన సూచనలు అందిస్తున్నాం. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలన్నది ఎన్టీఆర్ ట్రస్టు ఆశయం. అందుకే అట్టడుగున ఉన్నవారు కూడా గౌరవంతో జీవించేందుకు అవసరమైన అంశాల్లో వారిని ప్రోత్సహిస్తున్నాం. వారికి కూడా సమానస్థాయి వచ్చేందుకు వీలుగా సహకారం అందిస్తున్నామని భువనేశ్వరి చెప్పారు.












