- అక్కడి అధునాతన విధానాలపై అధ్యయనం
- డిసెంబర్ 5న మెగా పీటీఎంకు ఏర్పాట్లు చేయండి
- డీఈఓలు, ఎంఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే
- విద్యాశాఖపై సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): అధునాతన విద్యా విధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఈనెల 27వ తేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఈ నెల 27 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ లోని ప్రముఖ స్కూళ్లను సందర్శించాలి.. అక్కడి అధునాతన సాంకేతికలతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు..
క్లాసు రూముల్లో వాతావరణం తదితరాలపై పూర్తిస్థాయి అధ్య యనం చేసి, రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుకు మనం ఏ చేయగలమో నివేదిక రూపంలో అందజేయాలన్నారు. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి. గత ఏడాది మాదిరిగానే డిసెంబర్ 5వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ను రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా -ఏర్పాట్లు చేయాలి. ఇందులో ప్రజా ప్రతినిధులను భాగస్వాము లను చేయాలి. విద్యార్థుల పనితీరును తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా లీప్ యాప్ ను డిజైన్ చేశాం, దీని పై విస్తృతంగా ప్రచారం చెయ్యాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
నిరంతరం పర్యవేక్షించాలి.
డీఈఓ, ఎంఈఓలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పాఠశాలల పనితీరును నిరంతరంపర్యవేక్షించాలి. ఈ-ఆఫీసును బలోపేతం చేసేలా చర్యలు తీసు కోవాలి. లీప్ –1 గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ)పై వందరోజుల కార్యాచరణను సిద్ధం చేయండి. రాష్ట్రవ్యాప్తంగా కడప మోడల్ స్మార్ట్ కిచెన్లను ఏర్పాటుచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. నేషనల్ బెంచ్ మార్కుకు అనుగుణంగా పబ్లిక్, ఇతర విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా భవిత ఆటిజం సపోర్టు సెంటర్లఏర్పాటు, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం ఏర్పాటు చేసిన శాసనసభ్యుల కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్పుల ఎంపికకు సిద్ధపడుతున్న 8వ తరగతి విద్యార్థులను చైతన్యపర్చి వారిని ప్రోత్సహించాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. అమరావతి లో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు, పబ్లిక్ లైబ్రరీల బలోపేతం, పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు తదితర అంశాలపై డిజిటల్ లైబ్రరల ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయ రామరాజు, సమగ్రశిక్ష స్టేట్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.












