- అబద్ధాలు, విరుద్ధ ప్రకటనలతో మోకాలడ్డు
- వైసీపీపై విరుచుకుపడిన మంత్రి లోకేష్
- పరిశ్రలను తీసుకొస్తే క్రెడిట్ ఇస్తానని ఆఫర్
- కలిసి పనిచేస్తేనే ఏపీ అభివృద్ధి అని హితవు
- పరిశ్రమలకు అనుగుణంగా కరిక్యులమ్
- క్లస్టర్ బేస్డ్ అభివృద్ధిపైనే కూటమి దృష్టి
- మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి
అమరావతి (చైతన్య రథం): ఏపీ అభివృద్ధి బాటన పరుగులు తీస్తుంటే.. కొందరు కులం, మతం, ప్రాంతం ముసుగులో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఐటీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి గూగుల్ ప్రకటన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడాన్ని ప్రస్తావించారు. ‘‘గూగుల్‌వల్ల చెట్లు పెరగవన్నారు. తర్వాత వారి నాయకుడు.. గూగుల్‌ని నేనే తెచ్చానన్నారు. పచ్చి అబద్ధాలు, విరుద్ధ ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అటువంటి ప్రమాదకర మూకలపై ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజలన్నీ చూస్తున్నారు. వారికి అన్నీ తెలుసు. ఎవరేం చేస్తున్నారో అనుక్షణం మొత్తం ప్రజల ముందు ఉంచుతున్నాం’’ అని లోకేష్ వైసీపీపై విరుచుకుపడ్డారు. 14-15 తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ `2025 సన్నాహక ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో.. పలువురి ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.8లక్షల ఉద్యోగాలు కల్పించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘త్వరలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభించబోతున్నాం.
సప్లయ్-డిమాండ్ ఆధారంగా ఏఐ ద్వారా ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. మంత్రులంతా ఎకో సిస్టమ్‌పై దృష్టిపెట్టాం. మా అందరి లక్ష్యం ఒక్కటే… 20 లక్షల ఉద్యోగాల సాధన. అందరం ఫీల్డ్‌కు వెళ్తున్నాం. నవంబర్‌లో చాలా కంపెనీల ఫౌండేషన్ స్టోన్స్, రిబ్బన్ కటింగ్స్ ఉంటాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ 14నెలల్లో, గూగుల్ 13నెలల్లో, ప్రీమియర్ ఎనర్జీ 45రోజుల్లో రాష్ట్రానికి రప్పించాం. జీసీసీ క్వాలిటీ ఆఫీస్ స్పేసేస్ విశాఖకు వస్తున్నాయి. పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో ప్రభుత్వం, పెట్టుబడిదారులు, ప్రజలు కలిసి వస్తేనే అనుకున్నది సాధించగలం’’ అని లోకేష్ స్పష్టం చేశారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా తెలిసిన కంపెనీలకు చెప్పి రాష్ట్రానికి రప్పిస్తే క్రెడిట్ వారికి ఇస్తా. రాష్ట్రం కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అభివృద్ధి చేసుకుందాం. ముందుకు తీసుకెళ్లదాం’’ అని వైసీపీ సిగ్గుపడే ఆహ్వానాన్ని ఇచ్చారు. ‘‘ఇతర రాష్ట్రాల్లో అంతర్గతంగా కొట్టుకుంటారు. బార్డర్ దాటితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతారు. దురదృష్టవశాత్తూ మన రాష్ట్రంలో అలా లేదు. కలిసికట్టుగా వెళితేనే అనుకున్నది సాధించగలుగుతాం. వివిధ కారణాలవల్ల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో మనం వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు వాటిపైనా దృష్టిసారించాం. ఎడ్యుకేషన్ మంత్రిగా ఇండస్ట్రీ టై అప్ చేసి వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం’’ అని లోకేష్ స్పష్టం చేశారు.
పరిశ్రమలకు అనుగుణంగా కరిక్యులమ్
‘‘పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ బలోపేతం చేస్తున్నాం. టూవీలర్ మెకానిక్ నుంచి క్వాంటమ్ ఇంజనీర్ వరకు ఏఐ సాంకేతికతతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఏఐ బేస్డ్ ప్లాట్ ఫాం ఏర్పాటుచేస్తున్నాం. అన్నీ అందులో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో గూగుల్, 2028నాటికి ఆర్సెలర్ మిట్టల్, 2026 నాటికి ప్రీమియర్ ఎనర్జీ, ఏఎన్‌ఎస్‌ఆర్, ఇతర జీసీసీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. ప్రభుత్వాలు కొనసాగిన చోట రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. అందుకు తెలంగాణా, ఒడిశా రాష్ట్రాలు ఉదాహరణ. ప్రజలు కూడా ఆలోచించాలి. ఓవర్ నైట్ అద్భుతాలు జరగవు. ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నపుడు అరాచకపాలన చూశాం. ప్రతిపక్ష ఆఫీసులపై దాడులు, హత్యలు అందరం చూశాం. గతంలో మొదటి పేజిలో ఏరోజు చూసినా అవే వార్తలు వచ్చేవి. ఈరోజు పెట్టుబడులు వంటి పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి. రాష్ట్రంలో రోడ్లు బాగుచేశాం, ఇటీవల వర్షాలతో కొన్ని రోడ్లు పోయాయి. ఉభయగోదావరి జిల్లాలో వైట్ టాపింగ్ తో పర్మినెంట్ రోడ్లు వేస్తున్నాం. చంద్రబాబునాయుడు అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్… స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలే పెట్టుబడులకు ఉపకరిస్తున్నాయి. ప్రజలు ప్రతిపక్షానికి 11సీట్లు ఇవ్వడంతో ప్రజల మనోభావాలు పెట్టుబడిదారులకు అర్థమయ్యాయి. మాకు అన్ని జిల్లాలు సమానం. విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్ ఉత్తరాంధ్ర అంతటినీ కవర్ చేస్తుంది. అనంతపురంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుచేశాం’’ అని లోకేష్ మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
క్లస్టర్ బేస్డ్ అభివృద్ధిపైనే మా దృష్టి
‘‘మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైన, ముఖ్యంగా క్లస్టర్ బేస్డ్ అభివృద్ధిపై దృష్టిపెట్టాం. ప్రతి క్లస్టర్ మాకు ముఖ్యమైనదే. సౌత్ ఆసియా ఫస్ట్ 158 క్యూబిక్ బిట్ కంప్యూటర్ జనవరిలో అమరావతి రాబోతోంది. తొలుత తాత్కాలికంగా విట్ లో ఏర్పాటు చేస్తున్నాం. క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా విద్య, వైద్యరంగాల్లో చాలా మార్పులు వస్తాయి. పారిశ్రామిక ప్రగతిపై మాకు క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. విజనరీ లీడర్ చంద్రబాబుగారు 20 ఏళ్ల ముందుగా ఆలోచిస్తారు. ప్రజలు ప్రతిపక్షానికి 11 సీట్లు ఇవ్వడంతో ఇన్వెస్టర్లకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అరాచక పాలనవల్లే వారికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అడ్డగోలుగా మాట్లాడటం వల్లే ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు. పీపీఏలు రద్దుచేయడం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. 10వేల కోట్ల అప్పు మనపై పడుతోంది. ఆ సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకావడం లేదు. పీపీఏలు రద్దుచేసి ప్రజలను ఇబ్బంది పెట్టారు. దీనివల్ల ఏపీ యువకులు, ప్రజలు నష్టపోయారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సమీక్ష చేస్తున్నాం. మంచి నిర్ణయాలను కొనసాగిస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటివి రద్దుచేశాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని మేం అడగడం వల్లే కేంద్రం రూ.13వేల కోట్ల రాయితీలు ఇచ్చింది. అయితే స్టీల్ ప్లాంట్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంది’’ అంటూ.. ఏపీ గవర్నమెంట్ కూడా స్టీల్‌ప్లాంట్‌లో షేర్ హోల్డర్ అన్న విషయాన్ని మంత్రి లోకేష్ గుర్తుచేశారు.











