అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజలఆకాంక్షలు నెరవేరి, పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారు లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని, అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఈ ఏడాది జూలై 22న ఏడుగురు సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై సచివాలంయలో నిర్వహించిన సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తోపాటు… ఉప సంఘంలోని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్ధన్రెడ్డి హాజరయ్యారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని మంత్రులు ఈసందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటును సరిదిద్దేలా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనా, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా సీఎం చర్చించారు.
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే సమస్య
కొత్త జిల్లాల ఏర్పాటుపై గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ప్రాంతీయ విభేదాలకు కారణమైందని, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు భవిష్యత్లో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని నిర్దేశించారు. రెవెన్యూ డివిజన్ల పునర్వవ్యస్థీకరణను ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. పోలవరం పూర్తయిన తర్వాత ముంపు మండలాల ప్రజలు ఏ రెవెన్యూ వార్డు, ఏ నియోజకవర్గంలో ఉంటారనేదానిపైనా అధ్యయనం చేసి… దానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ జరపాలన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత చిరకాల వాంఛ అని సీఎం ప్రస్తావించారు. తమ పరిశీలనకు వచ్చిన అంశాలను, ఆయా వర్గాల అభిప్రాయాలను మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంగళవారం జరిగిన తొలి సమావేశంలో పలు అంశాలు చర్చించిన సీఎం… ప్రతిపాదనలపై తదుపరి చర్చలకు వారంలో మరోసారి సమావేశమవుదామని సూచించారు.














