- తుపాను నష్టాల ప్రాథమిక అంచనా వెల్లడిరచిన ముఖ్యమంత్రి
- సమిష్టి కృషి, టెక్నాలజీ సాయంతోనే తుపాను నష్టాల నివారణ
- ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడంలో ప్రభుత్వ చర్యలు.. ఒక మాన్యువల్
- క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పర్యటించారు
- గ్రామస్థాయి సిబ్బందినుంచి సీఎస్ వరకు అప్రమత్తంగా వ్యవహరించారు
- ‘మొంథా’ను టెక్నాలజీ సాయంతో అధిగమించాం..
- నష్టాల లెక్కలపైనా ‘సాంకేతిక’ సాయంతోనే ముందుకెళ్తున్నాం
- తుపాను పరిణామాలపై మీడియాతో సీపం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): మొంథా తుపానువల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్లమేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శాటిలైట్ చిత్రాలు, డ్రోన్లు, సీసీ కెమెరాల సాంకేతికత వినియోగించి ప్రాథమిక నష్టాల అంచనాలు రూపొందించామన్నారు. మొంథా తుపాను ప్రభావంతో కలిగిన నష్టాన్ని కూడా టెక్నాలజీ సాయంతోనే తగ్గించినట్టు సీఎం స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సీఎం.. రాష్ట్రంపై తుపాను ప్రభావం, టెక్నాలజీ సాయంతో నష్ట నివారణ అంశాలను వివరించారు. వ్యవసాయ పంటలకు రూ.829 కోట్లు, ఉద్యానరంగంలో రూ.39 కోట్లు, సెరీకల్చర్ రూ.65 కోట్లు, ఆక్వా రంగంలో రూ.1,270 కోట్లు, ఆర్ అండ్ బీకి రూ.2,079 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.109 కోట్లు, జలవనరుల విభాగంలో రూ.207 కోట్లు, పంచాయితీరాజ్ రూ.8 కోట్లు, విద్యుత్ శాఖ రూ.16 కోట్లు, పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షలు నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయన్నారు. త్వరలోనే నష్టం అంచనాలను తయారుచేసి కేంద్రానికి నివేదిస్తామన్నారు. ‘‘సాంకేతిక పరిజ్ఞానంతో తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేశాం.
అత్యంత ఖచ్చితత్వంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికల్ని చేరవేయగలిగాం. టెక్నాలజీ సాయంతో తుఫాన్ ప్రభావంవల్ల కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేశాయి. మొదటిరోజునే పరిస్థితులను చాలావరకూ చక్కదిద్దాం. ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావంపై సమీక్షలు నిర్వహించాం. అంతర్వేదికి సమీపంలో తీరందాటిన తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశాం. సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలతో ప్రకృతి వైపరీత్యంవల్ల జరిగిన నష్టాన్ని బాగా నివారించాం. వర్షాలు, గాలుల తీవ్రతను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి చర్యలు తీసుకున్నాం. గతంలో తుఫాన్ ప్రభావం తగ్గిన వారం రోజులవరకూ కోలుకునే పరిస్థితి ఉండేది కాదు. తుఫాన్లు, వర్షాలను ఆపలేం కానీ అప్రమత్తత, ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశముంది. తుఫాను ప్రభావం ఉన్న అన్ని ప్రాంతాల్లో టెక్నాలజీ ద్వారా నష్టాలను నివారించాం. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రవాహాలు పెద్దఎత్తున వస్తాయనేది అంచనా వేసి ముందస్తుగా హెచ్చరికలు ఇచ్చాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వివరించారు.
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఓ మాన్యువల్
‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినుంచి కలెక్టర్ వరకూ, లైన్ డిపార్టుమెంట్ల నుంచి గ్రామ వార్డు సచివాలయం వరకూ ఉద్యోగులు, సిబ్బంది తుపాను నష్టాల తీవ్రతను తగ్గించటంలో కృషి చేశారు. ఆర్టీజీఎస్‌నుంచి మంత్రులు లోకేష్, అనితలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయికి ఆదేశాలు జారీ చేశారు. అంతా కలిసి సమష్టిగా పనిచేయబట్టే ఇది సాధ్యమైంది. వారందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. గతంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా.. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదు. రియల్ టైమ్‌లోనే డేటా లేక్ ద్వారా సమాచారం విశ్లేషించి త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగాం. టెక్నాలజీ వినియోగించి పంట నష్టాలు, ముంపు ప్రాంతాలు తదితర అంశాలను కూడా గుర్తించాం. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూస్తుంటే కొందరు ఫేక్ మనుషులు.. ఫేక్ పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం కూడా వారికి ఇష్టం లేనట్టుంది. తుపాను కారణంగా నెల్లూరు నుంచి విశాఖ వరకూ భారీ వర్షాలు కురిసినా రాయలసీమలో కొన్నిచోట్ల వర్షాలు పడలేదు. వర్షాభావంతో కొన్ని ప్రాంతాలున్నాయి. రాష్ట్రంలో మొత్తం 37 కరవు మండలాలుగా ప్రకటిస్తున్నాం. ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు మొంథా తుపాను అనుభవాన్ని ఓ మాన్యువల్‌గా రూపొందిస్తాం. టెక్నాలజీ వినియోగం ప్రజాప్రయోజనాల కోసమే’’నని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
 
	    	 
 















