- తుఫాన్ సహాయక చర్యల్లో ప్రతిబింబించిన సీబీఎన్ మార్క్
- ఆర్టీజీ సెంటర్‌నుంచి రియల్ టైమ్‌లో పర్యవేక్షణ, దిశానిర్దేశం
- ఫైవ్ పాయింట్ ఫార్ములాతో మొంథాను ఎదుర్కొన్న ఏపీ
- మానిటర్, అలెర్ట్, రెస్క్యూ, రిహాబిలిటేషన్, నార్మల్సీపైనే ఫోకస్
- రక్షణ, సహాయక చర్యల్లో పూర్తిస్థాయిలో సాంకేతిక వినియోగం
- ఫైవ్ డేస్ ఫైట్‌లో అధికార యంత్రాంగం సూపర్ సక్సెస్
- ప్రభుత్వ ముందస్తు చర్యలతో తగ్గిన ఆస్తి, ప్రాణ నష్టాలు..
- క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల్ని పరామర్శించిన ముఖ్యమంత్రి
అమరావతి (చైతన్య రథం): మానిటర్, అలెర్ట్, రెస్క్యూ, రిహబిలిటేషన్, నార్మల్సీ. మొంథా తుఫాను విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం అమలు చేసిన పంచసూత్ర ప్రణాళిక ఇదే. తుఫాన్ హెచ్చరికలు వచ్చిన నాటినుంచి నిరంతరం మానిటర్ చేసుకోవడం… ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని.. ప్రజలను అలెర్ట్ చేయడం, నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, వారికి పునరావాసం కల్పించడం.. తుఫాన్ తగ్గాక.. సాధారణ పరిస్థితులకు తీసుకురావడం. మొంథా తుఫాన్ సమయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం ఈ అంశాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. దీనికి పూర్తిస్థాయి టెక్నాలజీని జోడిరచడం, క్షేత్రస్థాయిలో మంత్రులు, అధికారులు, ఉద్యోగులతో కూడిన బృందాలతో సమర్థవంతంగా పని చేయించడంతో మొంథా తుఫానువల్ల కలిగే నష్టాన్ని చాలావరకు నివారించగలిగింది. ప్రకృతి విపత్తును నివారించే అవకాశం లేదు కాబట్టి… నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలనే లక్ష్యంతో టీం ఆంధ్రప్రదేశ్ పనిచేసింది.
ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునే దిశగా ఐదు రోజులపాటు రాత్రీపగలూ తేడా లేకుండా అధికార యంత్రాంగం పనిచేసింది. ఇదే ఇప్పుడు సత్ఫలితాలను ఇచ్చింది. మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంమీద ఎక్కువగా ఉంటుందనే వాతావరణ హెచ్చరిక రాగానే సీఎం చంద్రబాబు అలెర్టయ్యారు. తుఫాన్ కదలికలను నిరంతరం మానిటర్ చేసుకోవడం… ఏయే ప్రాంతాల్లో ఎక్కువ తుఫాన్ ప్రభావం ఉండొచ్చనే విషయాలపై మానిటరింగ్ చేసుకోవడం… ఆ దిశగా క్షేత్రస్థాయిలో ఉన్న వారిని అలెర్ట్ చేస్తూ… మొంథా తుఫాన్ తీరాన్ని తాకినా… ప్రజల జీవితాలను తాకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. కొద్దిపాటి ప్రభావం ఉంటుందనుకున్న ప్రాంతాల్లోని వారినీ పునరావాస శిబిరాలకు తరలించారు. లక్షమందికి పైగా ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించి అన్ని రకాల ఏర్పాట్లూ చేశారు. క్షేత్రస్థాయినుంచి రియల్ టైంలో సమాచారాన్ని తీసుకోవడం.. దాన్ని విశ్లేషించడం… వాటిని ఆయా విభాగాల బాధ్యులకు చేరవేసి.. సమస్యను పరిష్కరించేలా చూడడంవంటి ప్రక్రియను సీఎం చంద్రబాబు నేతృత్వంలో బృందం సమర్థవంతంగా అమలు చేసింది. ఇక సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి… బాధితులకు భరోసా ఇచ్చారు.
అనుభవానికి టెక్నాలజీ తోడు
ఇక ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేలా ప్రభుత్వం ఈ విపత్తుకాలంలో పని చేసింది. శిశువులనుంచి వృద్ధుల వరకు.. అలాగే గర్భిణులనూ సంరక్షణ కేంద్రానికి తరలించింది. పశువుల ప్రాణాలను కాపాడేందుకు యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సమాయత్తం చేసింది. దీనికి టెక్నాలజీని జోడిరచారు. దీంట్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వరుసగా 1.1 కోట్ల సందేశాలు పంపారు. అలాగే సాంకేతికతను జోడిరచి గ్రామాల్లో మైక్‌ద్వారా అనౌన్సుమెంట్ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీజీ సెంటర్ నుంచే సెల్ ఫోన్ ద్వారా మైక్ ఎనౌన్సుమెంటును ఆపరేట్ చేసే విధానాన్ని రూపొందించడమే కాకుండా.. ఒకవేళ సెల్‌ఫోన్ సిగ్నల్ లేకపోతే శాటిలైట్ ద్వారా ఆ వ్యవస్థ పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చర్యలవల్ల గతంతో పోల్చితే ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు తీసుకురావడం సులువైంది. సహజంగా లంక గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలి రావడానికి ఇష్టపడరు. తుఫాన్లు వచ్చినా… ఇళ్ల పైకప్పులపైకి ఎక్కుతారు. కానీ ప్రభుత్వం ముందుగానే అలెర్ట్ చేయడంతోపాటు… క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఇంటింటికీ వెళ్లి వారికి నచ్చచెప్పి తుఫాన్ షెల్టర్లకు తీసుకొచ్చింది. దీంతో ప్రాణనష్టానికి స్థానం లేకుండా చేయగలగింది. ఇక టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని మరోసారి రుజువైంది. బాపట్ల జిల్లా పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని డ్రోన్ల ద్వారా గుర్తించి పోలీసులు, అధికారుల బృందం అతణ్ని రక్షించింది. అలాగే ప్రభుత్వం వద్ద ఉన్న అలెర్ట్ మెకానిజం ద్వారా త్వరగా రెస్పాండ్ కావడం వల్లే బాపట్ల జిల్లాలోనే ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లి చిక్కుకుపోయిన 15మందిని రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడారు. ఈ విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించినా.. వారి ప్రాణాలు దక్కేవి కాదు. ఇక గర్భిణులు, దివ్యాంగుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టెక్నాలజీతోపాటు… ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా హ్యండిల్ చేయాలనే అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న అనుభవం రాష్ట్రానికి మేలు చేసింది.
లైవ్ ట్రాకింగ్, రియల్ టైం సొల్యూషన్స్
పంటలకు నష్టం వాటిల్లకుండా కూడా ప్రభుత్వం వీలైనంత మేరకు జాగ్రత్తలు తీసుకుంది. తుఫాను హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి కాల్వల్లో గుర్రపు డెక్క తొలగించే అంశాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈవిధంగా చేయడం ద్వారా వీలైనంతమేర పంటనష్టం తగ్గించగలిగారు. ఇక డ్రెయిన్లు కూడా క్లీనప్ చేయడంతో… నగరాల్లో కూడా నీటినిల్వ లేకుండా చూడడంలో అధికార యంత్రాంగం విజయం సాధించింది. ఇక తుఫాన్ గాలులకు చెట్లుపడిపోయినా.. విద్యుత్ స్థంభాలు పడిపోయినా, వైర్లు తెగిపడినా వాటి కారణంగా ట్రాఫిక్ జాం కాకుండా, ప్రమాదాలు జరగకుండా.. వెంటనే వాటిని తొలగించడంతోపాటు.. విద్యుత్ వ్యవస్థను అతి తక్కువ సమయంలోనే పునరుద్ధరించారు. దీనికోసం అవసరమైన సామాగ్రి, వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. వేలకొద్దీ యంత్రాలను.. వాహనాలను ప్రణాళికాబద్దంగా వినియోగించుకున్నారు. ఇక సహాయక చర్యల నిమిత్తం జేసీబీలను భారీఎత్తున సిద్ధం చేశారు. వాటికి లైవ్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన మేరకు వాటిని వినియోగించుకునే వెసులుబాటు కలిగింది. గతంలో వర్షాలు వచ్చినా.. వరదలొచ్చినా.. బోట్లు కొట్టుకురావడం.. బ్యారేజీల గేట్లకు బలంగా తాకడం వంటివి జరిగేవి. కానీ ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే… నెల్లూరు జిల్లా కలెక్టర్ తనకు అందిన సమాచారంతో అలెర్ట్ కావడంతో భారీ బోటును చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. లేకుంటే సంగం బ్యారేజీకి ఆ బోట్లు ఢీ కొట్టి.. ప్రమాదం సంభవించేది. ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం, అలెర్ట్ మెకానిజం ఉండడంవల్ల తప్పిన ప్రమాదాలే. ఇక కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా నిరంతరం పర్యవేక్షించడంతోపాటు… గండ్లుపడితే వాటిని యుద్ధప్రాతిపదికన పూడ్చేందుకు అవసరమైన ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. అలాగే రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీ సెంటర్ ద్వారా వచ్చిన ఆదేశాలు గ్రామ సచివాలయస్థాయిలో వెంటనే అమలు చేయగలిగేలా విజయవంతంగా ప్రభుత్వం పని చేసింది.
త్వరితగతిన నష్టపరిహారం అందచేయడం…
ఇక పునరావాస శిబిరాలను ముందుగానే సిద్ధం చేశారు. ఎప్పుడు అవసరమైతే.. అప్పుడు సహాయ శిబిరాలను హడావుడిగా ఏర్పాటు చేసుకునే పరిస్థితికి స్వస్తి చెప్పాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాతావరణ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి పునరావాస శిబిరాలను సిద్ధం చేసుకోవాలని చెప్పడమే కాకుండా.. వాటిని అమల్లో పెట్టేలా చేశారు సీఎం. బాధితులకు ఆహారం, వసతి కల్పించడంతోపాటు.. కావాల్సిన మందులను కూడా పునరావాసంలో అందుబాటులో ఉంచారు. ఇలాంటి ఏర్పాట్లను సిద్ధం చేయడంతోపాటు.. పునరావాస కేంద్రాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే వైద్య బృందాలను సిద్ధం చేశారు. బాధితులకు అందించే నిత్యావసర వస్తువులను.. ఆర్థిక సాయాన్ని ముందుగానే ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఇక పునరావాస శిబిరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు… తుఫాన్ వెలిశాక.. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. పంటనష్టం అంచనాలను త్వరితగతిన వేసి.. కేంద్రానికి వీలైనంత త్వరగా నివేదికలు సమర్పించే వరకు పూర్తిస్థాయిలో ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం వ్యవహరించింది.
 
	    	 
 














