- మంత్రులు, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం
- తుపాను ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు ఇవ్వండి
- నష్ట నివారణకు టీంవర్క్ పనిచేయడమే కారణం
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలన్న సీఎం
అమరావతి (చైతన్య రథం): తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో బుధవారం ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్దం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సూచనలు చేశారు.
“సమర్థంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టాం. సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరం టీమ్ గా పనిచేశాం. కష్టకాలంలో బాధితుల కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు. మరో రెండురోజులు ఇలానే పనిచేస్తే.. మరింత ఊరట ఇవ్వగలం. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. ప్రభుత్వం ఏంచేసిందో చెబుతూ సమస్యలుంటే అడిగి తెలుసుకోవాలి. వివిధ విభాగాల్లో నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందించాలి” అని యంత్రాంగా నికి దిశానిర్దేశం చేశారు. “తుపానును నివారించలేం.. ముందు జాగ్రత్తలతో చాలావరకు నష్టాన్ని నివారించగలిగాం.
సచివాలయాలపై మైక్ అనౌన్స్మెంట్ సిస్టంను ఏర్పాటు చేసి కిందిస్థాయి వరకూ ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాం. వైపరీత్యాల సమయంలో ఉపయుక్తమైన నూతన విధానం తీసుకొచ్చాం. కలెక్టర్లు, అధికారులు రియల్ టైమ్ సమాచారం తెప్పించుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాగా పనిచేశారు. చెట్లు కూలినా, విద్యుత్ తీగలు తెగిపడినా యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. మున్సిపాలిటీల్లో డ్రెయిన్ల శుభ్రంవల్ల ముంపుబారిన పడకుండా చేశాం. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు 10 వేలమందిని అందుబాటులో ఉంచాం. ఇవాళ మధ్యాహ్నానికి సాధారణ స్థితి ఏర్పడుతుంది. తుపాను కారణంగా ఇద్దరు చనిపోయారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. మన చర్యలతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగింది.” అని చంద్రబాబు పేర్కొన్నారు.
తుపాను బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం
మొంథా తుపాను బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబంలో ముగ్గురికంటే ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3 వేలు అందజేయాలని పేర్కొంది. పునరావాస కేంద్రంనుంచి ఇంటికి వెళ్లేముందు ఈ నగదు ఇవ్వనున్నారు. ఈమేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.












