- బస్సు ఢీకొట్టేందుకు ముందే బైక్ యాక్సిడెంట్
- తరువాత రోడ్డుపై పడిఉన్న బైక్ను ఈడ్చుకెళ్లిన బస్సు
కర్నూలు (చైతన్యరథం): తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన మిస్టరీ వీడింది. బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మంటలు చెలరేగి 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడిపిన శివశంకర్ అనే యువకుడు కూడా మృతి చెందాడు. అయితే, బస్సు ఢీకొనడానికి ముందే శివశంకర్ బైకికి ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బైక్పై శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించారు. అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించి కీలక ఆధారాలు సేకరించారు.కేసు వివరాలను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం మీడియాకు వెల్లడించారు.శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా బైక్ నడుపుతూ చనిపోయిన శివశంకర్ పాటు వెనుకాల కూర్చున్న వ్యక్తి ఎర్రిస్వామి అలియాస్ నానిగా గుర్తించాం. అతన్ని పలు కోణాల్లో విచారించాం. ఎర్రిస్వామి, పల్సర్ బైక్ నడుపుతున్న శివశంకర్ ఇద్దరూ కలిసి లక్ష్మీపురం గ్రామం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 2గంటలకు) తుగ్గలికి బయల్దేరారు.
మార్గమధ్యలో అర్ధరాత్రి 2.24 గంటలకు కియా షోరూమ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీలో ఇద్దరూ ఉన్నారు. అక్కడి నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్కిడ్ అయి.. రోడ్డుకు కుడివైపు ఉన్న డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెనుక ఉన్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డు మధ్యలో పడి ఉన్న శివశంకర్ను పక్కకు తీసి, బైక్ను కూడా పక్కకు తీద్దామనుకునే సరికి అంతలోనే వేగంగా వచ్చిన బస్సు.. బైక్ ను ఢీకొని కొద్ది దూరం ఈడ్చు కెళ్లింది. బస్సు కింద మంటలు రావడంతో ఎర్రిస్వామి భయపడి అక్కడిరావడంతో ఎర్రిస్వామి భయపడి అక్కడి నుంచి తన స్వగ్రామం తుగ్గలి పారిపోయాడు. బస్సు ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనగిస్తున్నామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.














