- టేకూరువద్ద ట్రావెల్ బస్సు దగ్ధంపై సీఎం చంద్రబాబు
- ప్రమాద ఘటన వివరాలు తెలుసుకుని తీవ్ర దిగ్బ్రాంతి
- దుబాయ్‌నుంచి మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
- తక్షణ సహాయక చర్యలకు హోంమంత్రి, డీజీపీలకు ఆదేశం
- సంఘటనా ప్రాంతంనుంచే నివేదిక ఇచ్చిన మంత్రి మండిపల్లి
- ఘోర దుర్ఘటనపై మంత్రుల దిగ్బ్రాంతి.. తీవ్ర విచారం
అమరావతి (చైతన్య రథం): కర్నూలులో ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. ఘటనలో పలువురు మరణించారు. మరికొంతమంది తీవ్రగాయాలపాలయ్యారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల రవాణా మంత్రులు, అధికారులతో సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.
ప్రైవేటు బస్సుల ఫిటెనెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదికను కోరారు. హోంమంత్రి, రవాణా మంత్రి, సీఎస్, డీజీపీ, స్థానిక డీఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులు మరియు బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని, మృతుల సంఖ్య పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని, మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంతోపాటు, ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలంటూ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి రవాణా మంత్రి
ఘోర ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన రవాణా మంత్రి మండిలపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన, ఘటన హృదయ విదారకమన్నారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని రవాణా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలుండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారన్నారు. మృతుల వివరాలు త్వరగా గుర్తించి.. కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని సూచించారన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా వైద్యశాఖకు సూచనలు జారీ చేశారన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఫిట్‌నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలు కఠినంగా నిర్వహించాలని, అన్ని జిల్లాల్లో సాంకేతిక తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖను ఆదేశించారు. ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమై ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రాణ భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ: అనిత
హోం మరియు విపత్తుల మంత్రి వంగలపూడి అనిత కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇలాంటి దుర్ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్న హోం మంత్రి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, వారికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అచ్చెన్న
బస్సు ఘోర అగ్నిప్రమాదంపై వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులు ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించే విధంగా తగు భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో రవాణా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
తీవ్ర విచార వ్యక్తం చేసిన జనార్థన్ రెడ్డి
కర్నూలు జిల్లాలో బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటనపై దుబాయ్ పర్యటనలోనున్న రహదారులు భవనాల మంత్రి బిసి జనార్థన రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దుబాయ్‌నుంచే జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణ మరియు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైతే వారిని హైదరాబాద్‌కు తరలించాలని మంత్రి ఆదేశించారు. అనేక మంది ప్రయాణికులు సజీవ దహనమైన వార్త తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, ఇలాంటి దుర్ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కర్నూలు వైద్యులకు ఆదేశాలిచ్చిన సత్యకుమార్
బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైద్య మంత్రి సత్యకుమార్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్నూలు ప్రభుత్వాస్పత్రి సూపర్నెంట్‌ను ఆదేశించారు. బస్సులోనే భౌతిక అవశేషాలున్నందున, అవసరమైతే ఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఫోరెన్సిక్ వైద్యులను ఘటన స్థలానికి పంపించి, మృతులను గుర్తించేందుకు డీఎన్‌ఏ నమూనాలు సేకరించాలని మంత్రి సూచించారు. మృతదేహాల తరలింపుకు మహాప్రస్థానం వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రమాదంలో స్వల్పగాయాలతో 12మంది ఆసుపత్రిలో చేరగా, ప్రాథమిక చికిత్స అనంతరం వారిలో ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారని, ఒకరి పరిస్థితి నిలకడగానే ఉందని మంత్రి సత్యకుమార్ వివరించారు.
పూర్తిస్థాయి విచారణ జరపాలన్న మంత్రి ఫరూక్
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనపై తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేసిన న్యాయ, మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంలో ప్రయాణికులు సజీవదహనం కావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్న మంత్రి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రమాదంనుంచి బయటపడ్డ ప్రయాణికులకు అవసరమైన వైద్య సేవలు తక్షణం అందించాలని కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించారు. కర్నూలులో ప్రయివేట్ బస్సు ఘోర ఘటనపై పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ, ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారన్న సమాచారంతో మంత్రి చలించిపోయారు. ఘోర ఘటనపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 20మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందజేయాలని అధికారులకు సూచించారు.
తక్షణ సహాయక చర్యలు చేపట్టిన కర్నూలు యంత్రాంగం
చిన్నటేకూరు వద్ద సంభవించిన బస్సు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కర్నూలు జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ప్రమాద స్థలంలో పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ ఏ సిరి.. తక్షణ చర్యలకు ఉపక్రమించారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి బస్సులో సుమారు 41మంది ప్రయాణికులున్నారని, తెల్లవారుజామున 3 గంటల సమయంలో బస్సు బైక్‌ను ఢీకొనడంవల్ల ఇంధనం లీకై ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక నివేదికలో వెల్లడైందన్నారు. ఘటనలో 21మంది సురక్షితంగా ఉన్నారని, మిగిలిన 20మందిలో 11మంది మృతదేహాలను గుర్తించగా, మిగిలిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు పలు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ 9121101059, ఘటనాస్థలి కంట్రోల్ రూమ్ 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ 9121101075గా ప్రకటించారు. అదనంగా, ఆస్పత్రి హెల్ప్‌డెస్క్ నంబర్లు 9494609814 మరియు 9052951010 ద్వారా కూడా బాధితుల కుటుంబాలు సమాచారం కోసం సంప్రదించవచ్చని ఆమె తెలిపారు.











