- జగన్ హయాంలో ఏరులైన పారిన కల్తీ మద్యం
- తాడేపల్లి ప్యాలెస్‌లో కల్తీ తయారీకి ప్రణాళికలు
- తిరిగి.. కూటమి ప్రతిష్టకు భంగం కలిగేలా కుట్రలు
- రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత ఫైర్
- త్వరలోనే కల్తీ మద్యం వాస్తవాలు బయటపెడతామని హెచ్చరిక
అమరావతి (చైతన్య రథం): కల్తీ మద్యం పాపాత్ముడు జగనే అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. అయిదేళ్ల జగన్ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్ట మంటగలిపేలా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా కల్తీ మద్యం తయారీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అయిదేళ్ల జగన్ పాలనలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యానికి అధికారిక ముద్ర విచ్చలవిడిగా అమ్మకాలు చేశారన్నారు. ఆ 5 ఏళ్లలో కల్తీ మద్యం తాగి 30 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 30 లక్షల మంది అమాయకులు అనారోగ్యం పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ నాటుసారా తాగి 27 మంది ప్రాణాలు కోల్పోతే కనీసం పోస్టు మార్టమైనా చేయకుండా, విచారణ జరపకుండా కేసు తప్పుదారి పట్టించారన్నారు. గతంలో విజయవాడలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్ లో కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతిచెందడం వాస్తవం కాదా..? అని నిలదీశారు. 2014 ఎన్నికల సమయంలో సర్వేపల్లి, కావలి నియోజక వర్గాల వైసీపీ అభ్యర్థులు కాకాణి గోవర్దన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పంపిణీ చేసిన కల్తీ మద్యంతాగి ఎందరో అమాయకులు మరణించడం నిజం కాదా..? అని ప్రశ్నించారు. జగన్ అయిదేళ్ల పాలనలో బ్రాండెడ్ మద్యం అమ్మకాలను నిలిపేసి, జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యాన్ని అధిక ధరలకు విక్రయించి, పేదల రక్తమాంసాలు పీల్చిపిప్చి చేసి రూ.3,500 కోట్లు దోచుకున్నారన్నారు. దోచుకున్న డబ్బుతో ఆఫ్రికా దేశాల్లో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారన్నారు. ఇదే విషయం కామెరూన్ లో అక్కడి మంత్రి చెప్పడం వాస్తవం కాదా… రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ను సీజ్ చేయడం నిజం కాదా..? అని ప్రశ్నించారు.
తాడేపల్లి ప్యాలెస్‌లో కుట్రలు
కూటమి ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా తాడేపల్లి ప్యాలెస్ లో కల్తీ మద్యం తయారీ ప్రణాళికలు రచిస్తున్నారని మంత్రి సవిత విమర్శించారు. నకిలీ మద్యం తయారీకి జోగి రమేష్, ఏ-1 జనార్దన రావు జగన్ ఇంటిలోనే ప్రణాళికలు రచించారన్నారు. రాష్ట్రంలో అలజడి, అశాంతిని సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని వైసీపీ నాయకులపై మంత్రి సవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అయిదేళ్ల జగన్ పాలనలో కల్తీ మద్యం అక్రమాలు బయటకొస్తుండడంతో, డైవర్షన్ రాజకీయాలకు వైసీపీ నాయకులు తెరతీశారన్నారు.
కల్తీ మద్యంపై ఉక్కుపాదం
రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, అమ్మకాలపై సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మంత్రి సవిత వెల్లడిరచారు. జగన్ హయాంలో మూడు లక్షలకు పైగా బెల్ట్ షాపులుంటే, ప్రస్తుతం వాటిని పూర్తిగా మూయించామని తెలిపారు. బెల్ట్ షాపు తెరిస్తే రూ.5 లక్షల ఫైన్ వేస్తున్నామన్నారు. మొలకల చెరువు మద్యం తయారీ ఘటనపై ఇప్పటికే అయిదుగురు ఐపీఎస్ లతో సిట్ ఏర్పాటు చేశామని, త్వరలోనే వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని మంత్రి సవిత వెల్లడిరచారు. కల్తీ మద్యం ఆరోపణలు రాగానే, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డిని, కట్టా సురేంద్రనాయుడిని సీఎం చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. ఇదీ తమ పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. కల్తీ మద్యంలో నిందితులుగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఇతర వైసీపీ నాయకులను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని మంత్రి ప్రశ్నించారు. జగన్ కు, తాడేపల్లి ప్యాలెస్ కు కల్తీ మద్యం పాత్ర ఉండబట్టే, వారిని వెనుకేసుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అడ్డుకట్టవేయడానికి సురక్షా యాప్ రూపొందిస్తున్నామన్నారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరులో నూతన మద్యం పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం నాణ్యతను పరీక్షించడానికి 13 రకాల ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఐ) పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. దేశ, విదేశాలకు బ్రాండ్ మద్యాన్ని అందుబాటులో ఉంచామన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని మంత్రి సవిత ఆ ప్రకటనలో తెలిపారు.










