- ఐదేళ్ల పాలనలో రైతులకు తీరని ద్రోహం, నేడు మొసలి కన్నీళ్లు
- ధర్నాల పేరుతో శాంతి, భద్రతలకు విఘాతం కల్పించే కుట్ర
- మద్యం స్కాం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్నాటకాలు
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మండిపాటు
అమరావతి (చైతన్యరథం):
రైతులపై జగన్ మోహన్రెడ్డి, వైసీపీ ముఠా మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాల పేరుతో ఏపీలో శాంతి భద్రతలకు జగన్, ఆయన అనుచరులు విఘాతం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల మనోభావాలతో జగన్ ఆటలాడుతున్నారని నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో వున్నదంటే అది రైతు దగా పాలనకు నిదర్శనం కాదా అని సూటిగా ప్రశ్నించారు. వేలాది ప్రాణాలు తీసిన విషపూరిత మద్యం కుంభకోణం నుండి ప్రజల దృష్టి మరల్చడానికే ధర్నాల పేరుతో జగన్నాటకాలాడుతున్నారని పల్లా మండిపడ్డారు.
జగన్ కు, వైసీపీ ముఠాకు ఏ మాత్రం సిగ్గున్నా తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఖరీఫ్ కూటమి ప్రభుత్వం 7 లక్షల టన్నులకు పైగా యూరియా సరఫరా చేస్తోంది. ఇది మీ పాలనకన్నా లక్ష టన్నులు అధికం జగన్ మేనమామ కాదా? రవీంద్రనాథ్ రెడ్డి మిక్సింగ్ ప్లాంట్కు ప్రభుత్వ ఎరువులు అక్రమంగా తరలించి రైతులను ముంచింది.
నిజం కాదా? 2022లో ఎరువుల కొరత కృత్రిమంగా సృష్టించి, డీఏపీని బ్లాక్ మార్కెట్లో రూ.300 అదనంగా అమ్మిన ఘటనపై 29/08/2022, ఆగస్ట్ 29న యువనేత లోకేష్ నాటి సీఎంగా జగన్కు, ప్రధానికి లేఖ రాసింది నిజం కాదా? రైతు భరోసాకు రాష్ట్ర నిధుల నుండి జగన్ రూ.7500 లు మాత్రమే ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవకు రూ.14, 000 ఇస్తున్నది నిజం కాదా? మీ పాలనలో 42 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కానీ డబ్బులు చెల్లించకుండా మూడు నెలలు బకాయిలు పెట్టారు. మొత్తం మీద రూ.1674 కోట్లు బకాయిలు పెట్టింది వాస్తవం కాదా? కూటమి ప్రభుత్వం రైతుల ధాన్యం 68 లక్షల టన్నులు కొనుగోలు చేసి 24 గంటల్లోనే రూ.18 వేల కోట్లు డబ్బు జమ చేసింది. మీ పాలనలో ధాన్యం కొనుగోళు చేసి రైతులకు జమ చేసింది కేవలం సుమారు 6 వేల కోట్లు మాత్రమే కాదా? ఇన్పుట్ సబ్సిడీగా మీరు ఇచ్చింది రూ.1,977 కోట్లు మాత్రమే. నేడు చంద్రబాబు రూ.3,750 కోట్లు ఇచ్చారు. రైతుకు అండగా నిలిచింది ఎవరు?
డ్రిప్ ఇరిగేషన్కు చంద్రబాబు 90% సబ్సిడీ ఇచ్చారు… దానిని మీరు రద్దు చేసి రైతులకు ద్రోహం చేయలేదా? పావలా వడ్డీ రుణాలు రద్దు చేసి, రైతులపై భారాన్ని మోపింది మీ ప్రభుత్వం కాదా? ఇరిగేషన్ ప్రాజెక్టులపై 2014-19లో చంద్రబాబు రూ.71 వేల కోట్లు ఖర్చు చేశారు. మీరు రూ.30 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి రైతులకు ఏ మేలు చేశారో ఒకసారి చెప్పగలరా? పట్టిసీమ పూర్తి చేసి, డ్రిప్ ఇరిగేషన్ అమలు చేసి అదనపు పంటల సంపదను రైతులకు అందించినది. చంద్రబాబే. మీ పాలనలో ఒక్క కొత్త ప్రాజెక్టు అయినా చేశారా? అన్నమయ్య డ్యామును ఇసుక మాఫియాకు బలి చేసి 43 మంది ప్రాణాలు పోయేలా చేసింది మీ పాలనలోనే కాదా? రైతు కోసం కాకుండా మాఫియాకు అండగా నిలవడం వాస్తవం కాదా అని పల్లా నిలదీశారు.