- భక్తవత్సలం నా జీవితంలో స్ఫూర్తినింపారు..
- నిత్య విద్యార్థిని.. రోజూ ఏదోకటి నేర్చుకుంటా
- లోకేశ్ చదువుల క్రెడిట్ నా భార్యదే..
- టీచర్ల బదిలీల్లో కౌన్సిలింగ్ తెచ్చింది నేనే
- నేనుండగా ఉద్యోగులకు ఏ ఇబ్బందీ రానివ్వను
- పిల్లల్లో సృజనాత్మకతను పెంచే బాధ్యత గురువులదే
- టీచర్స్ డేలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో ఘనంగా గురుపూజోత్సవం
- 175మంది ఉత్తమ టీచర్లకు అవార్డుల అందజేత
విజయవాడ (చైతన్య రథం): టీచర్లను జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ‘‘పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది, మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది గురువులే. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు నా జీవితంలో స్ఫూర్తి నింపారు. నేను నిత్య విద్యార్థిని.. ప్రతి రోజూ ఏదోకటి నేర్చుకుంటా. సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లలు చదువుకోరు. లోకేశ్ చదువు గురించి నా భార్యే చూసేది. ఆ క్రెడిట్ ఆమెదే. డీఎస్సీ అంటే ఎప్పుడూ జాప్యం చేయను. సమయానికి భర్తీ చేస్తా. ఒకప్పుడు టీచర్ల బదిలీలు జెడ్పీ చైర్మన్ చేతిలో ఉండేవి. టీచర్ల బదిలీల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ తెచ్చింది నేనే. కొన్ని ఉద్యోగాల్లో పురుషులకంటే మహిళలే ఎక్కువ సంపాదిస్తున్నారు. తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునేందుకు అండగా ఉన్నాం. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
నేనుండగా ఉద్యోగులకు ఏ ఇబ్బందీ రాదు… రానివ్వను
‘‘భారత్‌లో ఉన్న కుటుంబ విలువలు ప్రపంచంలో ఎక్కడా లేవు. భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకోవడం.. పిల్లల కోసం కష్టపడటం ఎక్కడా లేవు. ఈ విలువలు కాపాడుకుంటే చాలు.. మన పిల్లలు ఏదైనా సాధిస్తారు. నేనుండగా ఉద్యోగులకు ఇబ్బంది రాదు.. రానివ్వను. ఉద్యోగుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నాది. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 700 ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. టీచర్లు తమ సిలబస్‌ను కూడా రీరైట్ చేసుకోవాలి. పిల్లలకు ఎలాంటి సిలబస్ అవసరమో రివైజ్ చేసుకోవాలి. టెక్నాలజీ విషయంలో నేటితరం పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా కరిక్యులమ్ ఉండాలి. ఉపాధ్యాయులు కూడా నిత్యం అప్డేట్ కావాలి. పిల్లల్లో సృజనాత్మకతను పెంచే బాధ్యత గురువులదే’’ అన్నారు.
అందుకే చుక్కా రామయ్యపై గౌరవం
‘‘ఐఐటీ కోచింగ్ విషయంలో చుక్కా రామయ్య కచ్చితంగా ఉండేవారు. పదివేలమంది దరఖాస్తు చేస్తే వందమందికి ఐఐటీ శిక్షణ ఇచ్చేవారు. వందకు వందమందినీ ఐఐటీకి పంపేవారు. అదీ ఆయన గొప్పతనం. ముఖ్యమంత్రిగా నేను సిఫారసు చేసినా సీటు ఇవ్వబోనని చెప్పేవారు. అందుకే చుక్కా రామయ్య అంటే గౌరవం పెరిగింది. పిలిపించి మాట్లాడా, మీ కోచింగ్ ప్రత్యేకత ఏమిటని అడిగి తెలుసుకున్నా’’ అని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
పిల్లలకు ఆస్తులివ్వడం కన్నా చదివిస్తే ఊహించనంత ఎత్తులకు ఎదుగుతారు.
ప్రతి పాఠశాలలో ఓ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలి.
పాఠశాల పాత స్టూడెంట్‌తో పాటు తల్లిదండ్రులను అందులో భాగస్వామ్యం చేయండి.
2014-19 మధ్య రాష్ట్రం కోసం కష్టపడ్డాను. కానీ తర్వాత రకరకాల కారణాల వల్ల ఓటమి చూశాను.
నేను రాజకీయాలపై ఫోకస్ పెట్టిన ప్రతిసారీ గెలిచాను.
2019-24 మధ్య కాలంలో రాష్ట్రానికి విభజనకంటే ఎక్కువ నష్టం జరిగింది.
2024లో ప్రజలు మాపై నమ్మకంతో గెలిపించారు… 94 శాతం స్ట్రైక్‌రేట్ ఇచ్చారు.
ప్రజలకు మరింత మేలు కలిగేలా పని చేస్తున్నాం.
కేంద్ర సాయంతో ఏపీని అభివృద్ధి చేస్తాం. పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తాం.
నా ప్రయత్నాలకు టీచర్ల సహకారం అవసరం. టీచర్ల చేతుల్లోనే భవిష్యత్ ఉంటుంది.
ఏ విషయంలోనైనా కాస్తో కూస్తో నిర్లక్ష్యం చేస్తానేమో కానీ… విద్యాశాఖను నిర్లక్ష్యం చేయను.
మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టాను. వివాదాలు లేకుండా అద్భుతంగా డీఎస్సీ నిర్వహించారు.
విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తెచ్చానన్న సంతృప్తి ఉంది.
ఒకప్పుడు విద్యా వ్యవస్థ జెడ్పీ ఛైర్మన్ల చేతుల్లో ఉండేది. ట్రాన్సఫర్ల కోసం టీచర్లు జెడ్పీ ఛైర్మన్ల ప్రాపకం కోసం వెళ్లేవారు.
విధిలేని పరిస్థితుల్లో టీచర్లు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవారు.
టీచర్లు ఆత్మగౌరవం దెబ్బతినకూడదనే.. ట్రాన్సఫర్లల్లో తొలిసారి కౌన్సిలింగ్ విధానం తెచ్చాను.
బ్రిడ్జి స్కూళ్లు పెట్టాం. బడికిపోదాం కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించాం.
ఇప్పుడు తల్లికి వందనం ద్వారా పేద విద్యార్థులకు చదువు అందేలా చేస్తున్నాం.
కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో చక్కటి సంస్కరణలు తెచ్చాం.
రాజకీయ నేతల పేర్లను పెట్టకుండా… విద్యా వ్యవస్థను పవిత్రంగా ఉంచుతున్నాం.
సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మవంటి పేర్లతో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం శుభ పరిణామం.
పిల్లలకు పుస్తకాల బరువు తగ్గేలా నో బ్యాగ్ డే ప్రవేశపెట్టారు.
పిల్లలకు విద్యాబుద్దులతో పాటు… విలువలు నేర్పాలి.
సంపదతో పాటు… విలువలు కాపాడుకోగలిగితే అన్నింటిలోనూ.. అగ్రభాగాన ఉండగలం.
జీతాలిస్తున్నాం కానీ… ఇంకా ఆర్థిక ఇబ్బందులున్నాయి.
నేను ఏ పరిస్థితుల్లో సీఎం అయ్యానో మీకు తెలుసు.
ప్రజలకు హామీలిచ్చాం. నేను సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టలేదు.. ఇబ్బంది రానివ్వను.
ఉద్యోగులు, టీచర్లు ఈ ప్రభుత్వంనుంచి ఏం ఆశిస్తున్నారో… అవన్నీ రానున్న రోజుల్లో అందించే బాధ్యత తీసుకుంటాం.
ఒకప్పుడు ఐటీ అర్థమయ్యేది కాదు… కానీ ఇప్పుడు ఐటీ రియాల్టీ.
టీచర్లు ఐటీ నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.
ఏఐ వంటి టూల్స్ ఉపయోగించి విద్యార్థులకు చాలా నేర్పించవచ్చు.
క్వాంటం కంప్యూటింగ్ తెస్తున్నాం. క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేసుకోవాలి.
పిల్లలు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. కొన్ని విషయాల్లో నాకంటే నా మనవడు దేవాన్ష్ ఫాస్టుగా ఉంటాడు.
అలాగే టెక్నాలజీ విషయంలో మీకంటే.. పిల్లలు వేగంగా ఉంటే.. అది టీచర్లకు ఛాలెంజ్‌లాంటింది.
యువత అవసరాలను… ప్రస్తుత ట్రెండ్సును తెలుసుకుంటూ అప్డేట్ కావడం నాకూ.. మీకూ అవసరం.
థియరీనే కాకుండా… వినూత్నమైన ఆలోచనలతో చదువు చెప్పాలి.
టెక్నాలజీ విషయంలో నాకంటే లోకేష్ మెరుగు. నేను థియరిటికల్ పర్సన్.. విజన్ ఉంది.
కంప్యూటర్ సైన్స్ బ్యాక్ గ్రౌండ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఎంబీఏ పట్టా లోకేష్‌కు అడ్వాంటేజ్.
అయితే లోకేష్ నాతో పోటీ పడడమంటే చాలా కష్టం.
టీచర్ల బాగోగులు చూసుకునే బాధ్యత నాది. విద్యార్థుల బాధ్యత టీచర్లది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి.
నాకంటే వేరే రాష్ట్రం మెరుగ్గా ఉంటే నేను తట్టుకోలేను.
ఎప్పుడూ రాష్ట్రాన్ని నెంబర్-1గా ఉండాలనే కోరుకుంటున్నా.
రాష్ట్రాన్ని నెంబర్-1గా చేసేందుకు అవసరమైన వసతులు కల్పించే బాధ్యత నాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత టీచర్లది.
మహిళల ఉన్నతికి బాటలు వేశాం. మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం.
డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశాం. ఆర్టీసీ కండెక్టర్లుగా మహిళలను నియమించాం.
ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం.
మగవారి కంటే ఎక్కువ ఆడవారే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇది నాకు సంతోషం కలిగిస్తోంది.
తల్లికి వందనం పథకానికి రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నాం.
ప్రధాని మోడీ జీఎస్టీ సంస్కరణలు తెచ్చారు. వీటివల్ల వినియోగదారులకు భారీ వెసులుబాటు కలుగుతుంది.
కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకుతీసుకెళుతున్నాం.
2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి మన దేశం వెళ్తుంది. ప్రపంచంలో తెలుగుజాతి నెంబర్ వన్‌గా ఉంటుంది.
నా ఆకాంక్షలు నెరవేరాలంటే టీచర్లంతా సహకరించాలి. ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
గతానికి భిన్నంగా టీచర్స్ డే వేడుకలు
ఈ ఏడాది టీచర్స్ డే వేడుకలు ఆద్యంతం ఆహ్లాదంగా… సరదా సంభాషణలతో సాగింది. టీచర్లను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నవ్వులతో ముంచెత్తారు. తండ్రిగా చంద్రబాబు తనను ఎలా చదివించారో సభలో మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. తాను చదువుకునే రోజుల్లో కొన్ని అంశాల్లో వెనుకబడితే… నేడు మంత్రిగా ఉన్న నారాయణను పిలిపించి బ్రిడ్జి కోర్సుల్లో శిక్షణ ఇప్పించారని మంత్రి లోకేశ్ నవ్వుతూ చెప్పారు. దీంతో సభ ఆహ్లాదంగా మారింది. తర్వాత మాట్లాడిన చంద్రబాబు కూడా లోకేశ్ గురించి నవ్వుతూ ప్రస్తావించారు. లోకేశ్‌కు చదువు చెప్పించిన ఘనత తన భార్యదేనంటూ క్రెడిట్ భువనేశ్వరికి ఇచ్చారు. స్టూటెంట్‌గా తన చిన్ననాటి అనుభవాలను మంత్రి లోకేశ్ పంచుకున్నారు. తనది రౌడీ బ్యాచ్, తాను బ్యాక్ బెంచ్ స్టూడెంటైనా… ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నానని చెప్పారు లోకేశ్. ఇక టెక్నాలజీపరంగా లోకేశ్ ముందున్నా… తనతో పోటీ పడలేరంటూ సీఎం ఛలోక్తులు విసిరారు. ఇక తాను తొలిసారి సీఎం అయినప్పుడు ఐఐటీ రామయ్యతో తనకు ఎదురైన అనుభవాలు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రామయ్య కోచింగ్ సెంటర్‌లో సీటు కోసం తాను సిఫార్స్ చేస్తే.. ఐఐటీ రామయ్య తిరస్కరించేవారని… అయినా ఐఐటీ రామయ్యపై తనకు కోపం రాలేదని… గౌరవం పెరిగిందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తనకు ఎకనామిక్స్ లెక్చరర్ పోస్ట్ ఆఫర్ చేస్తే రాజకీయాల్లోకి రావాలన్న కోరికతో ఆ ఉద్యోగాన్ని సున్నితంగా తిరస్కరించానని నాటి సంగతులను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.