- సముద్రంలోకి వృధాపోయే నీటితో రిజర్వాయర్లు నింపండి
- ఆగస్ట్ 31న కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు హంద్రీ నీవా జలాలు
- ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, సమర్ధ నీటి నిర్వహణపై జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 771 టీఎంసీ మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే మధ్యస్థాయి ప్రాజెక్టుల్లో 43 టీఎంసీ, చిన్న నీటి చెరువుల్లో 67 టీఎంసీ మేర నీరు నిల్వ ఉందని తెలిపారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో 882 టీఎంసీ మేర నీరు ఉన్నట్టు వివరించారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నదుల్లోకి ఇంకా ఎన్ని రోజులపాటు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. సోమశిల, కండలేరు, గండికోట, బ్రహ్మంసాగర్, పైడిపాలెం తదితర రిజర్వాయర్లన్నీ నింపాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువుల్లోకి ఇంకా 132 టీఎంసీ మేర నీటిని నింపేందుకు అవకాశముందని అధికారులు తెలిపారు. సగటున ప్రతీ రోజూ 4 టీఎంసీ మేర నీటిని తరలిస్తే ఎన్ని ప్రాజెక్టులను నింపే అవకాశముందో చూడాలని సీఎం సూచించారు. వీలైనంతమేర నీటిని తరలించి తుంగభద్ర, పెన్నా రివర్ బేసిన్లలో ఉన్న రిజర్వాయర్లను నింపాలన్నారు. గండికోట, మైలవరం, పీఏబీఆర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి కాలువలకు నీటిని విడుదలచేసి మరోవైపు వీటిని నింపాలని సూచించారు. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి, హంద్రీనీవా నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌కు కూడా నీటిని తరలించుకునే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీలైనంత వరకూ వ్యయం లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలని సీఎం అధికారులకు సూచనలు చేశారు.
చెరువులతో పాటు భూగర్భజలాలూ నిండాలి
రాష్ట్రంలోని 43 వేల చెరువులను నింపటం ద్వారా భూగర్భజలాలను కూడా రీఛార్జి చేయవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 1 మీటరుమేర భూగర్భజలాలు పెరిగితే 120 టీఎంసీ నీరు నిల్వ చేసినట్టేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున భూగర్భజలాలు 9.8 మీటర్ల లోతున ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి మరో 5 మీటర్లమేర నిల్వలు పెరిగేలా చర్యలు తీసుకుంటే, 600 టీఎంసీ నీరు అందుబాటులోకి వస్తుందని సీఎం స్పష్టం చేశారు. రుతుపవనాల సీజన్ సాధారణ వర్షపాతం అంచనాలున్నందున.. అన్ని రిజర్వాయర్లలో 1300 టీఎంసీ మేర నీరు నిల్వ అవుతుందన్నారు. తద్వారా ఖరీఫ్, రబీ సీజన్లకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుందని సీఎం అన్నారు. గ్రావిటీతోపాటు మొబైల్ లిఫ్టుల ద్వారా ఎన్ని చెరువులు నింపవచ్చన్న అంశాన్ని పరిశీలించాలని సీపం స్పష్టం చేశారు. బ్రహ్మంసాగర్, గోరకల్లు, మారాల, చెర్లోపల్లి, పత్తికొండ ప్రాజెక్టులకు దిగువన ఉన్న అన్ని చెరువుల్ని తక్షణం నింపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు రిజర్వాయర్లు, చెరువులు నింపే అంశంపై సాగునీటి సంఘాలను క్రియాశీలకం చేయాలని సీఎం స్పష్టం చేశారు. మొత్తంగా ఈ సీజన్‌లో చివరి ఆయకట్టు వరకూ ఎంతమేర నీరు తీసుకెళ్లగలమనేది ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. అలాగే చెరువులు, ప్రాజెక్టుల మరమ్మతులను కూడా వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు ఆగస్ట్ 31న నీళ్లు తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.