- ప్రాంగణంలో భావోద్వేగంతో లబ్ధిదారుల కేరింతలు
- దశాబ్దాల కల సాకారమయిందని హర్షాతిరేకాలు
- లోకేష్ చేసిన మేలు మరువలేమంటూ కృతజ్ఞతలు
- ఎప్పటికీ లోకేషే మంగళగిరి ఎమ్మెల్యేగా ఉండాలంటూ దీవెనలు
మంగళగిరి (చైతన్యరథం): మన ఇల్లు ` మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా యర్రబాలెం డాన్‌బాస్కో స్కూలు ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. 3వ రోజున సోమవారం మొత్తం 624 మందికి మంత్రి లోకేష్ చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231 మంది, తాడేపల్లి పద్మశాలి బజార్‌కు చెందిన 127మంది, పెనుమాకకు చెందిన 179మంది, ఉండవల్లికి చెందిన 77మంది, ఇప్పటం గ్రామానికి చెందిన 10 మందికి లోకేష్ శాశ్వత పట్టాలను అందజేశారు. తాడేపల్లి మండలం పెనుమాక వాసులకు పట్టాలు అందజేస్తున్న సమయంలో ఆ ప్రాంతవాసులు భావోద్వేగానికి గురయ్యారు. జై లోకేష్… లాంగ్ లివ్ లోకేష్ అంటూ పెద్దఎత్తున ప్రాంగణంలో నినాదాలు చేశారు. దశాబ్దాలుగా తాము ఎదురుచూస్తున్న పట్టాలను అందించడంతో వారంతా ఆనందంతో పొంగిపోయారు. శాశ్వత పట్టాలు తీసుకున్న లబ్ధిదారుల ఆనందం వారి మాటల్లోనే..
మేం వైసీపీకి చెందిన వాళ్లం… అయినా లోకేష్ పట్టాఇచ్చారు
-నల్లపు వెంకటనరసయ్య, పార్వతి, కొలనుకొండ.
మేం గత 20ఏళ్లుగా కొలనుకొండలో నివాసం ఉంటున్నాం. గతంలో ఎందరో పట్టాలు ఇస్తామని చెప్పారుగానీ పట్టించుకోలేదు. వాస్తవానికి మేం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లం. మేం అడగకుండానే లోకేష్ మాకు పట్టా ఇచ్చారు. గతంలో పనిచేసిన వాళ్లకు భిన్నంగా మంగళగిరి అభివృద్ధికి లోకేష్ కృషిచేస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యను లోకేష్ 10నెలల్లోనే పరిష్కరించడం అభినందనీయం. గత పాలకులకు భిన్నంగా లోకేష్ పనిచేస్తున్నారు. పట్టా అందజేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
లోకేష్ వచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు
-చొక్కా ఆరోగ్యమేరి, కొలనుకొండ.
నారా లోకేష్ మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు. గత 19 ఏళ్లుగా మేం ఎదురు చూస్తున్న పట్టాల సమస్య పరిష్కరించారు. దీర్ఘకాలంగా ఈ ప్రాంతవాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను 10 నెలల్లోనే పరిష్కరించారు. పారిశుద్ధ్యం ఎంతో మెరుగుపడిరది. మా గ్రామంలో సైడ్ కాల్వలు నిర్మించాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గతంలో నాయకులు మాటలు చెప్పి తర్వాత పట్టించుకునే వారు కాదు. లోకేష్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారు. ఆయన నేతృత్వంలో మంగళగిరి నియోజకవర్గం దేశంలో నెం.1గా నిలుస్తుందని నమ్ముతున్నాం.
కుటుంబసభ్యుడిలా మాపై శ్రద్ధ వహిస్తున్నారు
-జాలాది వాసంతి, కొలనుకొండ.
నారా లోకేష్ మంగళగిరి శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు. 16 ఏళ్లుగా మేం పట్టాల కోసం ఎదురుచూస్తున్నాం. కుటుంబసభ్యుడిలా ప్రత్యేక శ్రద్ధ వహించి మా సమస్యను పరిష్కరించారు. పార్టీలతో సంబంధం లేకుండా మా ప్రాంతంలో ఉంటున్న వారందరికీ పట్టాలు ఇచ్చారు. గతంలో పనిచేసిన వాళ్లెవరూ ఈ విధంగా చేయలేదు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా మా వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారు. మళ్లీ లోకేషే మా శాసనసభ్యుడిగా రావాలని కోరుకుంటున్నాం.
లోకేష్‌ను మా ఇంటిబిడ్డలా భావిస్తున్నాం
-ఎస్ కె సైదులు, సర్దార్ బీ, పద్మశాలి బజార్, తాడేపల్లి
లోకేష్ మాపై చూపుతున్న శ్రద్ధ చూస్తే కళ్లవెంట నీళ్లు తిరుగుతున్నాయి.37 సంవత్సరాలుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్నాం. పదినెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. లోకేష్‌ను మా ఇంటి బిడ్డలా భావిస్తున్నాం. మాకు ఇద్దరు బిడ్డలు. ఇప్పటివరకు పట్టా లేకపోవడంతో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్నాం. ఇప్పుడు పట్టా ఇవ్వడంతో మాకు ధైర్యం వచ్చింది. గతంలో మాటలు చెప్పినవారే కానీ పట్టించుకున్న వారు లేరు. మహిళల స్వయం ఉపాధిపై లోకేష్ శ్రద్ధ వహిస్తున్నారు. ఆడపిల్లలకు కుట్టుశిక్షణ ఇచ్చి, మిషన్లు అందజేస్తున్నారు. లోకేష్ లాంటి వ్యక్తి మా ఎమ్మెల్యేగా రావడం అదృష్టంగా భావిస్తున్నాం.
లోకేష్ చేసిన సాయం మాటల్లో చెప్పలేం
-జంజనం పార్వతి, లక్ష్మణరావు, పద్మశాలి బజార్, తాడేపల్లి.
తాడేపల్లి పద్మశాలి బజార్ లో 35ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. ఇప్పటివరకు మేం ఉంటున్న ఇంటికి సంబంధించి మావద్ద ఎటువంటి కాగితం లేదు. లోకేష్ చేసిన సాయాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాం. గతంలో ఎంతమంది చుట్టూ తిరిగినా పట్టించుకున్న నాథుడు లేడు. చాలా సంతోషంగా ఉంది. లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా వచ్చాక ఎంతో మార్పు కన్పిస్తోంది. పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొండ ప్రాంతంలో ఉండటంతో మాకు తాగునీటి సమస్య ఉంది, కుళాయిలు కావాలని అడిగాం. ఆ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. మళ్లీ ఆయనే ఎమ్మెల్యే కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.
లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
-వసంత, రహీం, తాడేపల్లి.
తాడేపల్లి పోలీస్ స్టేషన్ వెనుక 2008నుంచి ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. గత 16సంవత్సరాలుగా ఎందరో నాయకులను పట్టాల గురించి అడిగినా పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం లోకేష్ పట్టా ఇచ్చి మాటనెరవేర్చుకున్నారు. పార్టీ భేదాలు లేకుండా అర్హులైన వారందరికీ పట్టాలు అందజేస్తున్నారు. యువకుడైన లోకేష్‌లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న తపన, పట్టుదల కన్పిస్తోంది. లోకేష్ లాంటి నాయకుడు మంగళగిరి ఎమ్మెల్యే కావడం ఆనందంగా ఉంది. లోకేష్ మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతారు, మాకు ఎటువంటి సందేహం లేదు.
ఇంత త్వరగా ఇస్తారని అనుకోలేదు… మాకు ఆస్తి కల్పించారు
-తుమ్మపూడి దేవి, ఓంకార లక్ష్మి, పొనుగుమాటి వెంకటనర్సమ్మ, నాగేంద్రమ్మ, ఉండవల్లి.
మేము ఉండవల్లి కొండవాలు ప్రాంతంలో 22 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. ఎన్నికల సమయంలో లోకేష్ బాబు మా ప్రాంతానికి వచ్చినపుడు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇంతత్వరగా ఆయన మాకు పట్టాలు ఇస్తారని ఊహించలేదు. కాయకష్టం చేసుకుని జీవించే మాకు లోకేష్ ఒక ఆస్తి కల్పించారు. ఆయన చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం. గతంలో ఎప్పుడు మమ్మల్ని వెళ్లిపొమ్మంటారోనని భయం వేసేది. లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యే అయ్యాక ఎంతో మార్పు వచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. పట్టాల గురించి గతంలో ఎంతోమందిని ఎన్నిసార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది. మా చిరకాల కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉంది. లోకేష్ బాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం.
40ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం… మా కల నెరవేర్చారు
-రామినేని సంధ్య, కనకాల భవానీ, ఉండవల్లి.
ఉండవల్లి కొండ ప్రాంతంలో నివసిస్తున్న మా కుటుంబాలు 40ఏళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్నాయి. మేం నివసించే ప్రాంతంలోనే పట్టాలు కావాలన్నది చిన్నప్పటి నుంచి మా పెద్దల కల. లోకేష్ బాబు మా చిరకాల కోరిక నెరవేర్చారు. 40ఏళ్ల కలను లోకేష్ 10నెలల్లో నెరవేర్చారు. మాకు నోట మాటరావడం లేదు. గతంలో ప్రజాప్రతినిధులను పట్టాలు అడిగితే కొండ ప్రాంతంలో సాధ్యం కాదని చెప్పారు. లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. మాకు స్వయం ఉపాధి కోసం స్త్రీశక్తి పథకం ద్వారా కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్లు కూడా అందజేశారు. అన్నివిధాలా లోకేషన్న మాకు అండగా నిలుస్తున్నారు. లోకేష్ లాంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కావడం గర్వంగా ఉంది.
గతంలో పొక్లయినర్లు పంపారు… లోకేష్ బాబు ధైర్యాన్నిచ్చారు
-దాసరి వెంకాయమ్మ, లచ్చి అనూష, నాగమల్లేశ్వరి, ఇప్పటం.
గతంలో మా ఊరిలో రోడ్డు విస్తరణ పేరుతో పొక్లయినర్లు తెచ్చి కొందరి ఇళ్లు కూల్చేశారు. ఎప్పుడు ఎవరి ఇళ్లపైకి పొక్లయినర్లు వస్తాయోనని భయంభయంగా జీవించేవాళ్లం. ఎన్నికలకు ముందు రచ్చబండలో ఇచ్చిన వాగ్దానం మేరకు లోకేష్ బాబు మా ఇళ్లకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు మాకు ఎటువంటి భయం లేదు. లోకేష్ బాబు ఉన్నారన్న ధైర్యం వచ్చింది. ఇప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉంది. పట్టాల కోసం 30ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడ్డాం. ఎంతోమంది నాయకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయింది. లోకేష్ బాబు మాట ఇవ్వడమేగాక బట్టలుపెట్టి మరీ మాకు పట్టాలిచ్చారు. నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న లోకేష్ మళ్లీమళ్లీ మా ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాం. మా చిరకాల కోరిక నెరవేర్చి మాకు అండగా నిలిచిన లోకేష్ బాబుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.