- గ్రామకంఠంలోని భూములకు విముక్తి
- అక్రమిత భూముల క్రమబద్ధీకరణకు గడువు
- అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి(చైతన్యరథం): పేదలకు, నిజమైన భూ యజమానులకు న్యాయం జరగలానే లక్ష్యంతో 22ఏ నుంచి ప్రైవేట్ భూములను తొలగించాలని నిర్ణయం తీసు కున్నట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇందుకోసం గత నెల 17న మెమోను విడుదల చేశామని, నిషేధ ఆస్తుల జాబితా నుంచి ప్రైవేట్ భూములను ఎలా తొలగించాలనేది స్పష్టంగా అందులో తెలిపామని చెప్పారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధాన మిస్తూ అలాగే పంచాయతీల్లో గ్రామ కంఠాల్లో ఉండే ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. దీనికి సంబంధించి 2015లోనే అప్పటి కూటమి ప్రభుత్వం 187 జీవోను ఇచ్చిందని, పంచాయతీలకు చెందిన సామాజిక ఆస్తులు మినహా మిగిలిన ఆస్తులను నిషేధ జాబితా నుంచి తొలగిస్తూ ఆ జీవో ఇచ్చారని చెప్పారు.
అయితే గత ప్రభుత్వం రీ సర్వే చేసిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 4,157 ఎకరాలను నిషేధ జాబి తాలో పెట్టారని, దీనివల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామ కంఠంలోని ప్రయివేట్ ఆస్తులను పరిశీలించి నిషేధ జాబితా నుం చి తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్న వారికి క్రమబద్ధీకరణ చేస్తు న్నామని, వీరికి ఏడాది పాటు సమయం ఇచ్చామని, వీరంతా ఈ సౌకర్యాన్ని ఉపయో గించుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వం భూముల రీ సర్వేను ఫార్సుగా మార్చిందని, సరిహద్దు రాళ్లపై, పాస్ పుస్తకాలపైన బొమ్మలు వేసుకోవాలనే కాంక్షతో రీ సర్వేను తప్పుల తడకగా మార్చిందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం భూ యజమాను లకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సమగ్రంగా రీసర్వే చేయిస్తున్నామని చెప్పారు.