- ఏ అంశంపైనయినా చర్చకు సిద్ధం
- ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో తెలియదా
- తెలిసీ అనవసర రాద్ధాంతం ఎందుకు
అమరావతి (చైతన్యరథం) : ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో నీకు తెలీదా..అధికారంలో 30 ఏళ్లు ఉంటాన్నంటూ ఇంకా ఎన్నాళ్లు భ్రమల్లోనే బతుకుతావ్… నిన్ను గెలిపించిన పులివెందుల కోసం ప్రజల కోసమైనా అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖల మంత్రి ఎస్.సవిత హితబోధ చేశారు. అసెంబ్లీకి వస్తే ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి సవిత సోమవారం మాట్లాడుతూ అబద్ధాలతో ప్రజలను భ్రమల్లో ఉంచాలని జగన్ భావిస్తున్నారని, ఆయనను నమ్మే స్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతోందని, ఇంకా రాజారెడ్డి రాజ్యాంగమే కొనసాగుతోందని జగన్ అనుకుంటున్నారని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. జగన్ మాటలను నమ్మేస్థితిలో జనాలు లేరని, రాష్ట్రాభివృద్ధి ఎవరితో సాధ్యమని గ్రహించే ఆయనకు గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని అన్నారు. పరామర్శకు వెళ్లినప్పుడు ఆసుపత్రిలో ఎలా మెలగాలో కూడా జగన్‌కు తెలియదని, ఎన్నికల కోడ్ ఉంటుండగా గుంటూరు మిర్చి యార్డుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. జగన్‌కు ఎక్కడ ఎలా మెలగాలో కూడా తెలియకపోవడం శోచనీయమన్నారు.
మైక్ ఇస్తాం రా…
ప్రజా సమస్యలపై మాట్లాడానికి అసెంబ్లీకి రావాలని, కనీసం ఆయన్ను గెలిపించిన పులివెందుల ప్రజల కోసమైనా సభకు రావాలని జగన్ నుద్దేశించి మంత్రి సవిత కోరారు. ప్రజల కోసం పోరాటం చేయండి…ప్రజా సమస్యలపై మాట్లాడండి.. తప్పనిసరిగా మైక్ ఇస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. జగన్ కు ఎందరో సలహాదారులు ఉంటారని, వారందరి సలహాలు సూచనలు తీసుకుని అసెంబ్లీకి రావాలని, ఏ సబ్జెక్టుపైనైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సవాల్ విసిరారు.
జగన్‌కు మేధావులు మెసేజ్‌లు పంపాలి
మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, మాజీ సీఎంగా, మాజీ ఎంపీగా, పులివెందుల ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో జగన్‌కు తెలియదా అని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. మేధావులు, నిపుణులు స్పందించి, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో జగన్ కు మెసేజ్ రూపంలో తెలియజేయాలని మంత్రి కోరారు. కేవలం ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తుండటంతో జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు.