- ప్రభుత్వాసుపత్రులపై సీఎం నిరంతర సమీక్ష
- రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వాసుపత్రులు పనితీరుపై నిరంతర సమీక్ష జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు తెలిపారు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న అంశాల్లో అనతికాలంలో సానుకూలత సాధించకుంటే ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్లపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బుధవారం ఆయన సచివాలయంలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి 256 ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్పత్రుల సేవల నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. మొదటి దఫా అభిప్రాయ సేకరణ గతనెల 27న జరగ్గా, రెండో విడత అభిప్రాయ సేకరణ ఈనెల 7న జరిగినట్లు కృష్ణబాబు తెలిపారు. మొత్తం ఆరు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా.. 5 అంశాలకు సంబంధించి ప్రజల్లో సానుకూలత మెరుగైందన్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం, వారి ప్రవర్తన, మందుల సరఫరా, అవినీతి విషయాలకు సంబంధించి ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని చెప్పారు.
డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని స్పందించిన రోగుల శాతం 58నుంచి 84 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. డాక్టర్ల ప్రవర్తన బాగుందన్న వారి సంఖ్య 65 నుంచి 82 శాతానికి పెరిగిందని ఐవీఆర్‌ఎస్ సర్వేలో తేలిందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత విషయంలో వ్యక్తమైన ప్రజాభిప్రాయం పట్ల కృష్ణబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పరిశుభ్రత బాగా లేదన్నవారి సంఖ్య మొదటి సర్వేలో వెల్లడైన 33 శాతం నుంచి రెండో సర్వేలో 59 శాతానికి పెరిగినట్లు చెప్పారు. పరిశుభ్రత విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.