- నరేగా నిధుల వినియోగం పెంచండి
- అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): గ్రామాల్లో రహదారుల మరమ్మతులు, నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రజంటేషన్‌పై స్పందిస్తూ.. నరేగా నిధులు సమర్థవంతంగా వినియోగించాలన్నారు. వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తిచేస్తే.. వచ్చే ఏడాది లక్ష్యాలను మరింత పెంచుదామని సూచించారు. డ్వాక్రా సంఘాలు గత ప్రభుత్వ నిర్వాకం వల్ల నిస్తేజంగా మారాయన్నారు. మూడు దశాబద్దాల చరిత్ర మన డ్వాక్రా సంఘాలకుందని వివరించారు. ఒకప్పుడు మన డ్వాక్రా సంఘాల మహిళలు హిందీ భాష రాకపోయినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి డ్వాక్రా ఫిలాసఫీ బోధించి వచ్చిన సందర్భాలున్నాయని, ఇప్పుడు ఆ స్ఫూర్తి సంఘాల్లో లోపించిందన్నారు. డ్వాక్రా సంఘాలు తీసుకుంటున్న రుణాలు ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. వివిధ పథకాల కింద డ్వాక్రా సంఘాలకు రూ.50 వేల కోట్ల లింకేజీ పెడుతున్నామని, అలాంటప్పుడు సంఘాల పనితీరు మెరుగుపరిచేలా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ఆయా డ్వాక్రా సంఘాల్లో ఏయే నైపుణ్యాలున్నాయి, వారు చేసే వ్యాపారం ఎలా ఉంది తదితర అంశాలన్నీ బేరీజు వేసి వారిలో మళ్లీ చైతన్యం తీసుకొచ్చి సత్ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు అభివృద్ధి సాధించకపోతే ఎప్పటికీ పేదరికం రూపుమాపలేమని, ఈవిషయాన్ని అధికారులు గుర్తించి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.