అమరావతి (చైతన్యరథం): 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. వివిధ శాఖలకు చెందిన మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల సోమవారం వరుస సమావేశాలు నిర్వహించారు. ఇరిగేషన్, ఎక్సైజ్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు చెందిన మంత్రులు.. ఆయా శాఖల కార్యదర్శులతో మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు జరిపారు. తమ శాఖలకు కావాల్సిన నిధులను.. ప్రవేశపెట్టేబోయే పథకాలను సమీక్షల్లో ఆయా శాఖల మంత్రులు ఆర్థికమంత్రి పయ్యావులకు వివరించారు. పెండిరగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాల్సిందిగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టులకు నిధుల విడుదల చేసే దిశగా ఆలోచన చేస్తామని మంత్రి పయ్యావుల చెప్పారు. ప్రాధాన్యతల వారీగా ఏయే ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలనే అంశంపై జాబితా ఇవ్వాలని కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అవసరమైన బడ్జెట్ ఇవ్వాలని మంత్రి నిమ్మల ప్రతిపాదించారు.
వివిధ సంక్షేమ శాఖల్లో అమలు చేయాల్సిన పథకాలు, వాటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై ఆయా శాఖల మంత్రులు సవిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, ఎన్‌ఎండీ ఫరూక్ ప్రతిపాదనలు ఇచ్చారు. మైనింగ్ శాఖకు అవసరమైన నిధులను కేటాయించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు కోరారు. మైనింగ్ శాఖ నుంచి ఆదాయాన్ని కూడా అదే స్థాయిలో తీసుకురావాలని అధికారులకు మంత్రి పయ్యావుల సూచించారు. గనుల శాఖ నుంచి వీలైనంత నిధులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్న విషయాన్ని పయ్యావుల గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని అనవసరపు ఖర్చులు తగ్గించుకుని.. ప్రాధాన్యతల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టాలని కోరారు. కేంద్ర పథకాలతో లింక్ అయ్యేలా పథకాలు.. వాటికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని ఆర్థిక మంత్రి పయ్యావుల సూచించారు.