- ఫైళ్ల క్లియరెన్స్‌లో సీఎం చంద్రబాబు అభినందనలు శాఖ పనితీరుకు నిదర్శనం
- 26 జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
- పర్యాటక రంగానికి అద్భుతమైన ట్యాగ్‌లైన్ సిద్ధం చేసి విస్తృత ప్రచారం కల్పించాలి
- నూతన పర్యాటక పాలసీపై పెట్టుబడిదారులకు అవగాహన కల్పించాలి
- పర్యాటక శాఖ అధికారులకు మంత్రి దుర్గేష్ దిశా నిర్దేశం
అమరావతి (చైతన్యరథం): రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో పర్యాటక రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి, తమదైన ముద్రవేయాలని పర్యాటక శాఖ అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ దిశానిర్దేశం చేశారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్ 11వ ఫ్లోర్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ శాఖల అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు మంత్రి దుర్గేష్ మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి అద్భుతమైన ట్యాగ్ లైన్ సిద్ధం చేసి తీసుకురావాలని, ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో జరిగే సమావేశంలో అనుమతి తీసుకొని విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి దుర్గేష్ సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. తిరుపతి తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో శాఖాపరంగా తలెత్తిన సిబ్బంది సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సూర్యలంక మైపాడు బీచ్‌లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని రావాలని అధికారులకు సూచించారు. స్థానికంగా ఏ తరహా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందో చెప్పాలన్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా అటవీ, దేవాదాయ శాఖల అనుమతులు అవసరం వస్తే తాను సంబంధిత కేబినెట్ సబ్‌కమిటీలో మెంబర్ గా ఉన్నానని, తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత శాఖల మంత్రులు పవన్ కళ్యాణ్, ఆనం రాంనారాయణ రెడ్డిలతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అధికారులకు మంత్రి దుర్గేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వంపై పెట్టుబడిదారుల్లో అమితమైన విశ్వాసం ఉందని, ఆసక్తితో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి సరైన వివరాలు అందించి పీపీపీ విధానంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. సీఎస్సార్ నిధులు రాబట్టడం పై దృష్టి పెట్టి తద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడాలన్నారు. ఈ సందర్భంగా టూరిజం, కల్చర్ ఈవెంట్ క్యాలెండర్ సిద్ధం చేయాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అనుమతితో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి ఈవెంట్లు చేద్దామన్నారు.
అధికారులకు మంత్రి అభినందనలు
ఫైళ్ల క్లియరెన్స్ అంశంలో పర్యాటక శాఖ పేషీ పనితీరును కేబినెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారని శాఖ అధికారులకు మంత్రి దుర్గేష్ వివరిస్తూ అభినందనలు తెలిపారు. పర్యాటకశాఖ అధికారులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పర్యాటకం పరంగా ఏమేం అభివృద్ధి చేయాలో మరింత సృజనాత్మకంగా ఆలోచించాలన్నారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల కన్నా అంతకుమించి అందాలు, సహజ సిద్ధ ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఎక్కువున్నప్పటికీ ప్రాచుర్యంలో వెనుకబడ్డామన్నారు. ఆడియో, వీడియోల రూపంలో ప్రమోషన్స్ పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా తిరుపతి, కోనసీమ, వైజాగ్ లాంటి ప్రాంతాలే కాకుండా 26 జిల్లాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి సరైన ప్రతిపాదనలతో రావాలని అధికారులకు సూచించారు.
పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమ హోదా కల్పించారని గుర్తుచేస్తూ నూతన పర్యాటక పాలసీపై పెట్టుబడి దారులకు అవగాహన కల్పించి పెట్టుబడులు రాబట్టాలన్నారు. ఇన్వెస్టర్స్ టీం కి ప్రోత్సాహకాలు ఇచ్చే కార్యక్రమాలు చేద్దామన్నారు. ఇటీవలే విజయవాడ విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఇన్వెస్టర్ సమ్మిట్లు నిర్వహించామని త్వరలో తిరుపతిలో ఇన్వెస్టర్ సమిట్ నిర్వహిద్దామని తెలిపారు. అంతేగాక ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో సైతం ఇన్వెస్టర్స్ సమ్మిట్లు నిర్వహించి ఇన్వెస్టర్లను ఆకర్షిద్దామని తద్వారా రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసి భారీ సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిద్దామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు.
తిరుపతి లాంటి అధ్యాత్మిక ప్రాంతాల్లో హోం స్టే లు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. విభిన్న తరహా టూరిజంలను అభివృద్ధి చేసేందుకు సంకల్పించామని టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి అన్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్, అడ్వెంచరస్ స్పోర్ట్స్, చిల్డ్రన్స్ గేమ్స్, ఫిషింగ్ విత్ ఫిషర్ మెన్ వంటివి పర్యాటక ప్రాంతాల్లో ప్రవేశపెడతామని అన్నారు. పర్యాటకుడు పర్యాటక ప్రాంతంలో ఎక్కువ రోజులు గడిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల నియమితులైన అజయ్ జైన్, ఎండీగా ఆమ్రపాలి కాట పనితీరును మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. పర్యాటకశాఖ పరంగా ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, శ్రద్ద వహించి పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ పర్యాటకాభివృద్ధికి కృషి చేయడమే గాక, అధికారులకు దిశా నిర్దేశం చేస్తుండటం పై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్, ఎండి ఆమ్రపాలి, ఈడీలు పద్మావతి, శేషగిరి, ఏపీ టీడీసీ, ఏపీ టీఏ అధికారులు, ఆర్‌డీలు, డీవీఎం లు, డీటీసీలు, 26 జిల్లాల టూరిజం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.