- పనిమిదిసార్లు నన్ను గెలిపించి.. మీరు గెలిచారు
- ప్రజలందరికీ న్యాయం చేయడం సీఎంగా నా బాధ్యత
- కుప్పం అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెడతా..
- మరో పార్టీ సింబల్ తెలియని నియోజకవర్గం కుప్పం
- సుపరిపాలన అందించడానికే ‘‘జన నాయకుడు’’ పోర్టల్
- పార్టీ సేవకులకు నామినేటెడ్ పదవులతో న్యాయం చేస్తా
- కుప్పాన్ని దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
- వ్యవస్థలను నాశనం చేశారంటూ వైసీపీపై విసుర్లు
- 2వ రోజు కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు హామీ
కుప్పం (చైతన్య రథం): గత ఐదేళ్లలో ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నానని, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజలందరికీ సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ‘జన నాయకుడు’ పోర్టల్ రూపొందించామని, మొదట కుప్పంలో అమలు చేసి.. ఆపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…. కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనిది. నన్ను ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మారుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గంలో మరో పార్టీ జెండా ఎగరలేదు. రాబోయే ఐదేళ్లలో కుప్పాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘స్వర్ణ కుప్పం విజన్ -2029’కి రూపకల్పన చేశాము. ఇప్పుడు కుప్పం ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించి న్యాయం చేయడం కోసం జన నాయకుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
నాపై మూడు బాధ్యతలున్నాయి..
నేను పార్టీ అధ్యక్షుడిని. కుప్పం ఎమ్మెల్యేని. రాష్ట్ర ముఖ్యమంత్రిని. నాపై మూడు రకాల బాధ్యతలున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీ కార్యకర్తలు మేమిచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లేయించారు. పార్టీ అధ్యక్షుడిగా ఆ హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. అలాగే కుప్పం ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల బాగోగులు నేను చూసుకోవాలి. స్థానికులు వారి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చేందుకు వీలుగా ‘జన నాయకుడు’ పోర్టల్‌ను తీసుకొచ్చాం. ఇక్కడ నా పిఏ, కడా అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. నేను ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యతలను వారు నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. తద్వారా బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాను. ఇక ప్రభుత్వ సమస్యలన్నీ పీజీఆర్ఎస్కు వెళతాయి. గ్రీవెన్స్, భూ సమస్యలు, సీఎంఆర్ఎఫ్ వంటివి ప్రభుత్వం చూస్తుందని చంద్రబాబు వివరించారు.
టీడీపీ కార్యకర్తలను ఎంటర్ప్రెన్యూర్లుగా చేస్తా
‘పార్టీని తమ భుజాలపై మోస్తున్న కార్యకర్తలను ఎంటర్ప్రెన్యూర్లుగా తయారు చేస్తాం. టీడీపీ సభ్యత్వాలు కోటికి చేరువగా రావడం సంతోషాన్నిస్తోంది. టీడీపీకి కార్యకర్తలే బలం. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలబడిన కార్యర్తలను కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నాము. ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాము. వారి పిల్లల చదువులు, ఉద్యోగ, ఉపాధికి ఆర్థిక చేయూత అందిస్తున్నాము. పార్టీకి సేవ చేసిన వారందరికీ న్యాయం చేస్తాము. పార్టీ కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన వారికే పదవులిస్తాము’ అని చంద్రబాబు స్పష్టం చేశారు .
వ్యవస్థలను నాశనం చేశారు..
గత పాలకులు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులకుప్పగా రాష్ట్రాన్ని మార్చేశారని, అరాచక పాలనను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించారని, జైలు పాల్జేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మీడియా ప్రతినిధులపైనా కేసులు పెట్టారు. ఒక ఆర్డర్ తెచ్చి మీడియాపై కేసులు ఎత్తివేస్తాము. భూముల దస్త్రాలన్నింటినీ తారుమారు చేసిన ఘనలు వైసీపీ నేతలు. భూములను కబ్జా చేసేశారు. రెవెన్యూ సదస్సుల్లో ఆ దస్త్రాలన్నింటినీ సరిదిద్దుతున్నాం. యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు తీసుకొస్తున్నాము. రాష్ట్రంలో కరువును పారదోలి, నీటి భద్రత కల్పించేందుకు గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాము. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొస్తాను. ఆపై కుప్పానికీ నీరు అందిస్తాను. అలాగే హంద్రినీవా పనులను జూన్‌కల్లా పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు భరోసానిచ్చారు.