- యువనేత లోకేష్ చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తి!
- 5కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించిన యువగళం
- నాటి హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు
రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలచి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి చీకటిపాలనను కూకటివేళ్లతో పెకలించిన యువనేత నారా లోకేష్ చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తయింది. నాటి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ఇంతింతై వటుడిరతై అన్న చందంగా పల్లెలు, పట్టణాలను ఏకం చేస్తూ సాగిన యువగళం పాదయాత్ర… ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చి రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చేసింది. 2023 జనవరి 27న కుప్పం శ్రీ వరదరాజ స్వామి పాదాల చెంత ప్రారంభమైన యువగళం పాదయాత్ర గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన గాజువాక నియోజకవర్గం అగనంపూడి టోల్ ప్లాజా సమీపంలో దిగ్విజయంగా ముగిసింది. తండ్రి చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్రను ముగించిన చోటే యువనేత లోకేష్ యువగళం పాదయాత్రను ముగించారు. రాష్ట్రంలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2200 గ్రామాలను స్పృశిస్తూ 226 రోజులపాటు 3,132 కి.మీల మేర సాగిన యువగళం పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక పాలనను కూకటివేళ్లతో పెకలించింది. అడుగడుగునా ప్రతిబంధకాల నడుమ నాటి పాలకుల కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తూ చారిత్రాత్మక యువగళం పాదయాత్ర విజయవంతమైంది.
యువగళం గొంతునొక్కేందుకు జగన్ కుట్ర
జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు నాటి వైసిపి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. జిఓ 1 పేరుతో నల్లచట్టాన్ని తచ్చి యువనేత నారా లోకేష్ గొంతునొక్కడానికి నాటి ప్రభుత్వం విఫలయత్నం చేసింది. పోలీసుసైన్యంతో పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటూ అవరోధాలు సృష్టించింది. మాట్లాడే మైకు నుంచి నిలబడే స్టూలు వరకు అన్నీ లాగేసి యువనేత గొంతునొక్కాలని చూశారు. యువగళాన్ని సజావుగా సాగనిస్తే పాదయాత్ర… లేదంటే దండయాత్రగా మారుతుందని లోకేష్ బెబ్బులిలా గర్జించారు. యువనేత లోకేష్ చేసిన యాత్ర చిత్తూరు జిల్లాలో పూర్తయ్యేలోపు తొలి 45రోజుల్లో రోజుమార్చి రోజుకొక కేసు చొప్పున 25 తప్పుడు కేసులు బనాయించారు. బాణాసంచా కాల్చారంటూ పీలేరు ఇన్‌చార్జి కిషోర్ కుమార్ రెడ్డి, కలికిరి సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డి, మరికొందరిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. చివరకు పాదయాత్రలో టపాసులు కాల్చారని కూడా కేసులు బనాయించారంటే యువగళం యాత్రను చూసి నాటి ప్రభుత్వం ఎంతలా ఆందోళన చెందిందో అర్థంచేసుకోవచ్చు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన యువగళం
యువగళం పాదయాత్ర యువనేత లోకేష్ ఒక్కడి గొంతుక కాదు…5కోట్ల ప్రజల అంతరంగాన్ని ప్రతిబింబించే సింహగర్జన అని తెలుసుకోవడానికి నాటి పాలకులకు ఎక్కువ సమయం పట్టలేదు. పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటే లోగా రాష్ట్రంలోని 107 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో గెలుపొందేందుకు జగన్ ప్రభుత్వం వందల కోట్లు మంచినీళ్లలా ఖర్చుచేసి అధికార బలగాలను దుర్వినియోగం చేసిన యావత్తు యువత తెలుగుదేశం పార్టీకే అండగా నిలిచారు. పాదయాత్రను అడ్డుకునేందుకు కృష్ణాజిల్లా నుంచి కవ్వింపు చర్యలకు దిగిన వైసిపి మూకలు… భీమవరంలో పాదయాత్రపై విరుచుకుపడ్డాయి. యువగళం వాలంటీర్లపై తప్పుడు కేసులు బనాయించారు. చంద్రబాబునాయుడు అరెస్టైన రోజునే 59మంది యువగళం వాలంటీర్లను నిర్బంధించి రాజమండ్రి జైలులో పెట్టారు. అక్రమ కేసులతో చంద్రబాబునాయుడును అరెస్టు చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 9వ తేదీన రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద పాదయాత్రను తాత్కాలికంగా నిలపివేయాల్సి వచ్చింది. గత ఏడాది నవంబర్ 26వ తేదీన పునఃప్రారంభమైన యువగళం పాదయాత్రను… ఎన్నికల క్రతువు ముంచుకొని రావడంతో అనివార్యంగా గాజువాక నియోజకవర్గంలో అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది.
హామీల అమలుదిశగా ప్రజాప్రభుత్వం అడుగులు
సుదీర్ఘ యువగళం పాదయాత్రలో యువత, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా యువనేత నారా లోకేష్ అనేక హామీలను ఇచ్చారు. ముఖ్యంగా సీమ ప్రజల కోసం కడపలో రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించారు. యువనేత లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రతిబింబిస్తూ ఎన్‌డిఎ కూటమి సూపర్ సిక్స్ పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించింది. పాదయాత్రలో యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్తప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజునే మెగా డిఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి సంతకం చేశారు. అధికారంలోకి వచ్చాక యువతకు ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని యువనేత లోకేష్ ఇచ్చిన హామీ అమలుకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతోంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆరునెలల్లోనే రూ.4.6లక్షల కోట్ల పెట్టుబడులు, 4లక్షలమందికి పైగా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్, గూగుల్, టిసిఎస్, వీడియోకాన్ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన యువనేత లోకేష్… ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. పోలీసు వలయాలు, పరదాల మాటున కాకుండా అనుక్షణం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వాడే ప్రజానాయకుడని ఆచరణాత్మకంగా నిరూపిస్తున్న యువకెరటం నారా లోకేష్ నేటితరం రాజకీయ నాయకులకు స్పూర్తిగా నిలుస్తున్నారు.
(కందిమళ్ల కృష్ణారావు)