- పేదలకు మెరుగైన జీవనం కోసం డిప్యూటీ సీఎం పవన్ తపన
- ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మంత్రి లోకేష్
- ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు కలెక్టర్లే
- రాష్ట్రాభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం
- భూ సమస్యలను పరిష్కరిద్దాం
- జిల్లా కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ మంత్రి అనగాని
అమరావతి (చైతన్యరథం): సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా, విజన్ ఆంధ్రా – 2047 లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉద్ఘాటించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి అనగాని మాట్లాడుతూ మంత్రులు, డీజీపీ, కలెక్టర్లు, శాఖాధిపతులు, ఇతర సిబ్బంది అందరికీ స్వాగతం పలుకుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలను చర్చించుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. పేదవాడికి మెరుగైన జీవనం కల్పించాలని తపన పడే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రాకు మంత్రి నారా లోకేష్ ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని మంత్రి అనగాని కొనియాడారు.
కబ్జాదారుల భరతం పడతాం
ఈ రాష్ట్రానికి వారసత్వంగా అప్పులు, భూకబ్జాలు, డ్రగ్స్ మాఫియా వచ్చాయి. ప్రజలకు వారసత్వంగా వచ్చే భూమిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అలాంటి భూమి కబ్జాకు గురయ్యిందంటే ఆ బాధ వర్ణనాతీతం. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎన్నో భూకబ్జాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. భూఅక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌కి అసెంబ్లీలో ఆమోదం లభించింది. త్వరలోనే చట్టం కాబోతోంది. ల్యాండ్ గ్రాబింగ్‌కు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిబంధనలు తీసుకురాబోతున్నాం. రాబోయే రోజుల్లో పేదవాడికి తన భూమిపై హక్కులు కల్పించేలా చేస్తాం. గత ప్రభుత్వంలో 9.26 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ పేరుతో పేదలనుంచి రాయించుకున్నారు. అందులో 4.21 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అంటే 45 శాతం భూములు కబ్జా చేశారని తేలింది. వీరందరికీ నూతన చట్టంతో గుణపాఠం చెప్పబోతున్నామని మంత్రి అనగాని స్పష్టం చేశారు.
ఇళ్ల పట్టాల పేరుతో స్కాం
గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పేరుతో మరో స్కాం చేశారు. ప్లాట్లను తీసుకున్నవారు అమ్ముకోవచ్చని చెప్పారు. అలా చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటాం. 45 వేల ఎకరాలను వైసీపీ పెద్దల అనుయాయులకే అసైన్డ్ చేశారు. గ్రీవెన్స్‌లో రెవెన్యూ శాఖలోనే అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. భూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈనెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. వస్తున్న ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించే చర్యలు చేపడుతున్నాం. అక్రమాలకు పాల్పడిన అధికారులపైనా చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు 31,324 ఫిర్యాదులు వస్తే 400 సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాం. మిగతా వాటిని ఎందుకు పరిష్కరించలేకపోయామనే దానిపై పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అనగాని చెప్పారు.
రీ సర్వేపై అపోహలు తొలగించాలి
రీసర్వేపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో సర్వే రాళ్లు, భూహక్కు పత్రాలపై కూడా వాళ్ల బొమ్మలు వేయించుకున్నారు. ఇప్పుడు రూ.12 కోట్లు వెచ్చించి వాటిని తొలగిస్తున్నాం. గ్రీవెన్స్‌లో వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాకే రాజముద్ర, క్యూఆర్ కోడ్, ల్యాండ్ మ్యాప్‌తో కూడిన భూహక్కు పత్రాలు అందిస్తాం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచేది కలెక్టర్లు. రాష్ట్రాభివృద్ధిలో ఐఏఎస్ ఆఫీసర్లకు ఇదొక మంచి అవకాశం. రాబోయే రోజుల్లో ఎలాంటి భూసమస్యలు లేకుండా చేద్దాం. సమస్యలకు పరిష్కారం చూపించేలా చర్చిద్దామని మంత్రి అనగాని సూచించారు.